కేంద్రం మీద యుద్ధం చేయటంలో భాగంగా చంద్రబాబునాయుడు ఢిల్లీలో దీక్ష చేయనున్నారా ? తెలుగుదేశంపార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ఏపి ప్రయోజనాల కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు కొంత కాలంగా బిల్డప్ ఇస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా బిల్డప్ డోసును మరింతగా పెంచుతున్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో చంద్రబాబు దీక్ష అనే ఫీలర్ ను వదిలారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా ? సమావేశాల చివరి రోజున దీక్ష చేస్తే ఎలాగుంటుందన్న ఆలోచనలో చంద్రబాబున్నట్లు సమాచారం.

 

ఇదే విషయమై పార్లమెంటు సభ్యులతో జరిగిన టెలికాన్ఫరెన్సులో చర్చించారట. చంద్రబాబు గనుక దీక్షకు కూర్చుంటే జాతీయ నేతలంతా మద్దతు తెలుపుతారంటూ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పారట. రాష్ట్ర సమస్యలకు రానున్న బడ్జెట్లో కూడా పరిష్కారం చూపకపోతే అప్పుడు ఆలోచించుకుని దీక్షకు కూర్చుంటే బాగుంటుందనే సూచన కూడా వచ్చిందట. కామెడీ కాకపోతే ఐదు బడ్జెట్లు అయిపోయాయి. నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టినపుడు చంద్రబాబు ఎన్డీఏలోనే ఉన్నారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్లో మాత్రం ఏపి ప్రయోజనాల గురించి కేంద్రం ఏమాలోచిస్తుంది ?

 

చంద్రబాబు దీక్షకు దిగటం ద్వారా కేంద్రం షేకయిపోతుందని ఎంపిలన్నారట. భజన బృందాన్ని చుట్టూ పెట్టుకుంటే ఇంతకన్నా బ్రహ్మాండమైన ఐడియాలు గాక ఇంకేమొస్తాయి ? ఇఫ్పటికే కేంద్రంపై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ధర్మపోరాట దీక్షలనే డ్రామాలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ చంద్రబాబు సాధించిందేమిటి ? అంటే ఏమీ లేదనే అనుకోవాలి. కోట్ల రూపాయల ప్రభుత్వ డబ్బు పెట్టి దీక్షలంటూ అటు ప్రధానమంత్రి నరేంద్రమోడిని, ఇటు జగన్మోహన్ రెడ్డిని తిట్టటం తప్పితే చేస్తున్నదేమీ లేదనే చెప్పాలి.  కాబట్టి రేపటి రోజున ఢిల్లీలో దీక్ష చేసినా పెద్ద ఉపయోగం ఉంటుందని అనుకునేందుకు లేదు. కాకపోతే మీడియాలో మాత్రం బ్రహ్మాండంగా ప్రచారం దక్కుతుందనటంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: