ఏటేటా నిర్వహించే ఎట్ హోం ఎన్నెన్నో విశేషాలకు కేంద్రబిందువు కావడం ఓ చరిత్ర. అక్కడ వారు వీరు అవుతారు. ఎన్నో వింతలకు నాంది పలుకుతారు. ఎట్ హోం లో పలకరింపులు వెనక రాజకీయ రంగులెన్నో ఉంటాయి. గవర్నర్ ఇచ్చే తేనీటి విందులో వేడి వేడిగా రాజకీయ ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ మంటలో చలి కాచుకునే సీన్లు ఎన్నో  కనిపిస్తాయి.


అప్పట్లో అలా :


అది 1989 గణతంత్ర వేడుకల సందర్భం. అలనాడు ఎట్ హోంలో అన్న నందమూరి ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి గవర్నర్ కుముద్ బెన్ జోషీ ఎట్ హోం విందుకు కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే సూపర్ స్టార్ క్రిష్ణ తొలిసారిగా హాజరయ్యారు. అప్పటికి అన్న నందమూరికి వ్యతిరేకంగా క్రిష్ణ అటు జనంలో ఎన్నికల ప్రచారంతో పాటు, ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు కూడా తీసి ఉన్నారు.  అది ఎన్నికల సంవత్సరం కూడా.  అన్న గారు ఎట్ హోంలో అంత ఉత్సాహంగా లేరు. అప్పటికే  రాజకీయం రాజుకుంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా జనాభిప్రాయం పోగు అయింది. దాంతో కాంగ్రెస్ లో కొత్త సందడి కనిపించింది. దాంతో మంచి జోష్ మీద క్రిష్ణ, ఇతర కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ని అభిమానించే సినీ నటులతో ఎట్ హోం గొప్ప హడావుడిగా సాగింది. అనుకున్నట్లుగానే ఆ ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అలా ఎట్ హోం ముందే జోస్యం చెప్పేసింది.


గులాబీ బాస్ తో పవన్ :


ఇపుడు చూస్తే 2019. అంటే మూడు దశాబ్దాల ముందుకు వచ్చిన కాలం. ఇది కూడా ఎన్నిక ఏడాదే. ఈసారి ఎట్  హోం కి జనసేనాని, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సెంటర్ అట్రాక్షన్ అయ్యారు. టీడీపీ నుంచి ఉప ముఖ్యమంత్రి క్రిష్ణ మూర్తి మాత్రమే వచ్చారు. మొన్ననే జరిగిన తెలంగాణా ఎన్నికల పరాభవమో, లేక కేసీయర్ తో ఎదురు పడడం ఇష్టం లేకనో చంద్రబాబు హాజరు కాలేదు. ఇక ఈ మధ్యనే టీయారెస్ తో కొత్త స్నేహం కలిపిన వైసీపీ అధినేత జగన్ జాడ కూడ లేదు. కానీ ఈసారి  ఎట్ హోం బాగానే ఆకట్టుకుంది. కేసీయార్ పక్కనే పవన్ కళ్యాణ్ కూర్చుని ముచ్చట్లు పెట్టడం మీడియాకు హైలెట్ అయింది. అలాగే మరో వైపు కేటీయార్ తోనూ పవన్ మంతనాలు జరపడం కూడా కెమెరా కళ్ళను దాటిపోలేదు. మరి ఆ మాటల సారాంశం ఏంటి అన్నది  ఇప్పటికిపుడు తెలియకపోయినా పొలిటికల్ హైలెట్ గానే దీన్ని అంతా చూస్తున్నారు.


ఫెడరల్ ఫ్రంట్ చర్చలా :


ఇక చూసుకుంటే ఓ వైపు జగన్ని ఫెడరల్ ఫ్రంట్ లోకి లాగేసిన కేసీయార్, ఇపుడు పవన్ని కూడా అదే ముగ్గులోకి లాగుతున్నారా అన్న సందేహాలకు ఆస్కారం కల్పిచేలా ఈ ముచ్చట్లు సాగాయి. ఏపీలో బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్న కేసీయార్ చంద్రబాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివిన రాజకీయ చతురుడు. మరి కేసీయార్ వ్యూహాలు కనుక అమలు చేస్తే రేపటి ఎన్నీకలలో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయి. ఎట్ హోమ్ లో ఈ నేతలు  ఏం మాట్లాడుకున్నరన్నది ఎవరూ పెదవి విప్పకపోయినా వారు వేసే అడుగులు బట్టి పొలిటికల్ హీట్ ఎలా ఉంటుందన్నది చెప్పెయవచ్చు. కాకపోతే వైట్ అండ్ సీ.


మరింత సమాచారం తెలుసుకోండి: