ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ‌ విపక్ష వైసీపీలో అస‌మ్మ‌తి జ్వాలలు ఒక్కొక్కటిగా ఎగిసిపడుతున్నాయి. ఈ అస‌మ్మ‌తి జ్వాలలు చివరకు పెనుజ్వాలలుగా మారి వైసీపీని నిండా ముంచేస్తున్నాయి. ఇటీవల విజయవాడలో ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పార్టీని వీడి పార్టీ అధ్యక్షుడు జగన్‌పై సంచలన ఆరోపణలు చెయ్యడం ఆ పార్టీ వర్గాల్లోనూ, రాష్ట్ర ప్రజల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. రాధా సంగతి ఇలా ఉంటే రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా వైసీపీలోనూ అస‌మ్మ‌తి రాగాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు జగన్‌ పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెడుతుండడంతో అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడిన వారు పార్టీ అధినేత, స్థానిక పార్టీ నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీలో ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జులుగా ఉన్నవారికి రేపు సీటు వస్తుందో లేదో, సీటు వచ్చినా బీఫామ్‌ చేతికి వస్తుందో లేదో అన్న టెన్షన్‌ స్టాట్‌ అయ్యింది. 


వైసీపీలో ఇప్పటికి సైతం చాలా నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్‌చార్జులుగా ఉన్నవారు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీటు వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడున్న వారికన్నా ఆర్థికంగా ఇంకెవరైనా బలమైన వ్యక్తులు వస్తే జగన్‌ తమను పక్కన పెట్టేస్తాడన్న భయం వారిని వెంటాడుతోంది. రాయలసీమలోని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాల్లో ఉన్న మొత్తం 14 సీట్లలో టీడీపీ 12 సీట్లలో గెలిస్తే వైసీపీ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలిచింది. ఉరవకొండలో వైసీపీ నుంచి విశ్వేశ్వరరెడ్డి కేవలం 2000 ఓట్ల తేడాతోనూ, కదిరిలో అత్తర్ చాంద్‌ బాషా కేవలం 600 ఓట్లతో మాత్రమే విజయం సాధించారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు లోనైన చాంద్‌బాషా సైకిల్‌ ఎక్కేసారు. తాజాగా వైసీపీ రాయలసీమ వ్యవహారాల సీట్ల పంపిణీ చూస్తున్న రాజంపేట తాజా మాజీ ఎంపీ మిధున్‌ రెడ్డి సీట్ల ప్రకటనపై క్లారిటీ ఇచ్చేస్తుండడంతో అనంతపురం వైసీపీలో విభేదాలు ఒక్క సారిగా భ‌గ్గుమన్నాయి. 


సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాధిధనిత్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో మాజీ మున్సిపల్‌ ఛైర్మెన్‌ నవీన్ నిశ్చ‌ల్‌ వైసీపీకి ఏడెనిమిది ఏళ్ల పాటు అన్నీ తానే వ్యవహరించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి బాలయ్యకు గట్టి పోటీ ఇచ్చిన నవీన్ నిశ్చ‌ల్‌ వచ్చే ఎన్నికల్లో మరో సారి పోటీకి రెడీ అవుతున్నారు. సానుభూతి పవనాలతో పాటు పార్టీలో తనకు ఉన్న గ్రిప్‌ నేపథ్యంలో ఈ సారి అక్కడ సంచలనం నమోదు చేస్తానన్న ధీమాతో ఆయన ఉన్నారు. అయితే జగన్‌ అనూహ్యంగా నిశ్చ‌ల్‌కు షాక్‌ ఇచ్చి ఆయన్ను తప్పించి ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘ‌నీకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఘ‌నీకే హిందూపురం సీటు వస్తున్నట్టు కూడా ప్రకటన చేశారు. దీంతో నవీన్‌ నిచ్చలతో పాటు ఆయన వర్గీయులు జగన్‌పై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. ఇక టీడీపీని వీడేందుకు సిద్దమైన నవీన్‌ వర్గీయులు ఇటీవల టీడీపీ నేతలతో కూడా టచ్‌లోకి వెళ్లారు. నవీన్‌ త్వరలోనే బాలకృష్ణను, చంద్రబాబును కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో వైసీపీ ఓటమే ధ్యేయంగా తాము పని చేస్తామని నవీన్ నిశ్చ‌ల్‌ వర్గీయులు ఇప్పటికే జగన్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


కదిరిలో సిద్దారెడ్డికి వజ్ర భాస్కర్‌రెడ్డి షాక్‌ తప్పదా..?
గత ఎన్నికల్లో వైసీపీ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచిన కదిరి వైసీపీలోనూ  ముసలం చెలరేగింది. నియోజకవర్గం సీటును ఆ పార్టీ సమన్వయకర్తగా ఉన్న సిద్దారెడ్డికే ఇస్తున్నట్లు మిధున్‌ రెడ్డి ప్రకటన చేశారు. మిధున్‌ రెడ్డి ఈ ప్రకటన చేసిన వెంటనే సీటు ఆశించిన మరో నేత వజ్ర భాస్కర్‌రెడ్డి తీవ్రస్థాయిలో అధిష్టానంపై ఫైర్‌ అయ్యారు. సిద్దారెడ్డితో పోలిస్తే అన్ని సర్వేల్లోనూ తానే ముందు ఉన్నానని అలాంటిది జగన్‌ తనను ఏ ప్రాతిప‌దిక‌న పక్కన పెట్టి సిద్దారెడ్డికి సీటు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తాను ఇండీపెండెంట్‌గా పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. సర్వేల్లో మూడో స్థానంలో ఉన్న సిద్ధారెడ్డికి సీటు ఇచ్చారని ఇది ఎంత వరకు సమంజసమని కూడా జగన్‌కు సూటి ప్రశ్న వేశారు. వచ్చే ఎన్నికల్లో 200లకు 200 శాతం తాను ఇండీపెండెంట్‌గా పోటీ చేసి సత్తా చూపుతానని వజ్ర భాస్కర్‌ రెడ్డి ప్రకటించడంతో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు కష్టంగానే కనిపిస్తోంది. ఏదేమైన దీంతో పాటు జిల్లాల్లో అనంతపురం, రాయదర్గుం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనే ఇదే తర‌హా అసంతృప్తి నెలకొంది. ఈ అసంతృప్తి జ్వాలలు ఎన్నికల వేల వైసీపీ అధినేతకు పెద్ద షాకులు ఇచ్చేలా ఉన్నాయి. మరి వీటిపై జగన్‌ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: