ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపీ అధికార పార్టీ టీడీపీ అన్ని వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఒక్కొటొక్క‌టిగా వెలుగు చూస్తున్నారు. ఆది నుంచి కూడా రాష్ట్రంలోని బీసీ సామాజిక వ‌ర్గాల‌పై దృష్టి పెట్టిన టీడీపీ.. ఈ వ‌ర్గాన్నిత‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో బీసీ జ‌నాభా 52% మంది ఉన్నారు. వివిధ కులాలు, వ‌ర్గాలు అన్నీ కలుపుకుంటే.. ప్ర‌తి జిల్లాలోనూ వీరి ఆధిప‌త్యం క‌నిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో మ‌రింత ఎక్కువ‌గా వీరి ప్ర‌భావం ఉంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌నుకునేపార్టీ ఖ‌చ్చితంగా బీసీల‌ను భుజాన ఎక్కించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ విష‌యంలో ఒకింత‌దూకుడుగా వున్న టీడీపీ ప్ర‌భుత్వం.. తాజాగా జ‌య‌హో బీసీ పేరుతో భారీ ఎత్తున స‌భ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు బీసీల‌పై వ‌రాల వ‌ర్షం కురిపించారు. 


తెలుగుదేశం అంటేనే బీసీలు. బీసీలంటేనే తెలుగుదేశం పార్టీ! వెనుకబడిన వర్గాలను ఆదరించింది, వారికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీయే. బీసీల్లో ఐక్యత తీసుకువస్తాం. 52 శాతం జనాభా బీసీలే. వాళ్లకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ. జయహో బీసీ సభతో చరిత్రను తిరగరాస్తాం- అంటూ చంద్ర‌బాబు భారీ ఎత్తున ఆవేశం ప్ర‌ద‌ర్శించారు. ప్రతిపక్షం గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలి. మనమంద రం కలిస్తే విపక్షాలకు డిపాజిట్లు వస్తాయా; అన్యాయం చేసి న పార్టీలను వదిలిపెడతామా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కూడా కురిపించారు. అదేస‌మ‌యంలో రజక, నాయీ బ్రాహ్మణ, సగర, వడ్డెర, కృష్ణ బలిజ, వాల్మీకి, కుమ్మరి, భట్రాజ కులాల ఫెడరేషన్లన్నీ కార్పొరేషన్లుగా మార్పు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అదేవిధంగా అస‌లు ఎలాంటి ఫెడ‌రేష‌న్లు కూడా లేని శెట్టి బలిజ, గౌడ, శ్రీశయన, విశ్వబ్రాహ్మణ, మేదర, వడ్డెర, యాదవ, కురబ, మత్స్యకారులు, తూర్పు కాపులు, కొప్పుల వెలమ, చేనేత, కళింగ, గవర, గాండ్ల కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

Image result for chandrababu naidu

ఈ ప‌రిణామంతో చంద్ర‌బాబు తిరిగి త‌న‌కు అధికారం ద‌క్కుతుంద‌ని భావిస్తున్నారు. మొత్తం బీసీ వ‌ర్గాల‌న్నీ కూడా త‌న‌వైపు తిరుగుతాయ‌ని అనుకుంటున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో బీసీల్లోని మేధావులు కొన్ని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు తొక్కిపెట్టిన చంద్ర‌బాబు ఇప్పుడు ఏదో తాను బీసీల‌ను ఉద్ధ‌రిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌లు జారీ చేయ‌డం ఏంట‌ని వారు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఏ వర్గాలకు చెందిన వారిని కేంద్ర మంత్రులుగా పంపారో అందరికి తెలుసన్నారు. టీడీపీ నుంచి ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపారా అని ప్రశ్నిస్తున్నారు. బీసీలు జడ్జిలుగా పనికిరారు అని కేంద్రానికి లేఖ రాసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. మత్క్యకారులను ఎస్టీల్లో కలుపుతామని ఓట్లు వేయించుకొని.. నిరసన చేస్తే అంతు చూస్తానన్న మాటలను ప్రజలు మర్చిపోలేదనేది వీరి ఆవేద‌న. 


ఇంత‌టితో ఆగిపోకుండా.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్న బీసీని టీటీడీ బోర్డు చైర్మ‌న్‌ను చేశాన‌నే వ్యాఖ్య‌ల‌పైనా దుమారం రేగుతోంది. ఆర్థికంగా స్థితిమంతుడు, పార్టీలో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నాయ‌కుడు, పార్టీలోని కీల‌క నాయ‌కుడితో బంధుత్వం ఉన్న నాయ‌కుడు క‌నుక‌నే ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ద‌క్కింద‌నే ప్ర‌శ్న తెర‌మీదికి తెస్తున్నారు. ఇక‌, బీసీ మ‌హిళ‌ల‌కు చంద్ర‌బాబు ఎక్క‌డ కీల‌క ప‌ద‌వి ఇచ్చారో కూడా చెప్పాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ఏకైక మ‌హిళా మంత్రి కూడా ఓసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలేన‌ని బీసీల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం అంటే కేవ‌లం ప్ర‌క‌ట‌న‌లు గుప్పించ‌డం కాద‌నేది బీసీ మేధావుల మాట‌. ఇక‌, ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన వ‌న్నీ కూడా అసెంబ్లీలో చ‌ర్చించి ఆమోదం పొందాల్సి ఉండ‌డం మ‌రో ప్ర‌ధాన స‌మ‌స్య‌. రాబోయే బడ్జెట్ స‌మావేశాల్లో వీటిపై చ‌ర్చించి అప్ప‌టిక‌ప్పుడు కార్పొరేష‌న్ల‌ను ప్ర‌క‌టించినా.. చైర్మ‌న్ల ఎంపిక జ‌రిగే నాటికి ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఏదేమైనా చంద్ర‌బాబు ఎంత ఆర్భాటంగా బీసీల‌కు వ‌రాలు ప్ర‌క‌టించారో.. అంత ఆర్భాటంగా ఆయ‌న‌కు పాజిటివ్ నెస్ రాక‌పోవ‌డం సుస్ప‌ష్టం. 


మరింత సమాచారం తెలుసుకోండి: