వైఎస్ జగన్ లో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఆయన పట్టు పట్టారంటే విడవరు అంటారు. అది పూర్వం నాయకులకు బాగా ఉండేది. వారే ఎన్నో విజయాలు కూడా సాధించారు. వర్తమాన రాజకీయాల్లో మాత్రం అటువంటి నాయకులు లేరు. మరి జగన్ వయసుకు యువకుడే అయినా అయన పోకడలు చాలావరకూ పాతతరాన్ని గుర్తుకుతెస్తాయి. రాజకీయాల్లో నైతిక విలువలు, అన్న మాటకు నిలబడడం వంటివి జగన్ కి ప్లస్ గా ఉన్నాయి. 


నాడు అన్న గారు అలా :


విషయానికి వస్తే ఏపీ శాసన సభ చివరి సమావేశాలు ఈ రోజు మొదలుతున్నాయి. పేరుకు పది రోజులు అన్నారు కానీ సెలవులు అన్నీ పోతే గట్టిగా అయిదు రోజులు మాత్రమే జరుగుతాయి. ఈ సమావేశాలకు యధాతధంగా వైసీపీ బాయ్ కాట్ చేసింది. అంటే గత ఏడాదిగా ఆ పార్టీ ఏదైతే మాటకు కట్టుబడి ఉందో దాని మేరకే సభకు నమస్కారం అంటోంది. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మేల్యేలను టీడీపీ లాక్కుంది. అందులో నలుగురిని మంత్రులుగా చేసింది. 
వారిని సస్పెండ్ చేయమని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దానిపై ఇంతవరకూ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల చివరి సమావేశాలకు కూడా రామనే చెప్పేసింది. ఇది నిజంగా చూసుకుంటే ఆనాడు అంటే 1993 కాలంలో అన్న నందమూరి చేసిన శపధాన్ని గుర్తుకుతెస్తోంది. అప్పట్లో అన్న గారు కూడా తనకు అవమానం జరిగిన అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదని భారీ ప్రకటన చేసి బయటకు వచ్చేశారు. మళ్ళీ ఆయన అసెంబ్లీకి వెళ్ళింది సీఎం హోదాలోనే.


అదే రిపీట్ అవుతుందా :


మరి ఉమ్మడి ఏపీలో అన్నగారు చేసిన శపధం నెరవేరింది. తాను సీఎం గానే అడుగుపెడతానని ఆయన చాలెంజ్ చేసి బయటకెళ్ళిపోయారు. అలాగే బంపర్ మెజారిటీతో ఆయన తిరిగి 1994లో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రిగా ట్రజరీ బెంచిల వైపు కూర్చున్నారు. మరి ఇపుడు జగన్ కూడా పట్టుదలలో అన్న గారి పోలికలు కలిగిన వారే. అందువల్లనే ఆయన కూడా తమకు న్యాయం జరగని అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. మరి ఈసారి కూడా అదే చరిత్ర రిపీట్ అవుతుందా అని అంతా అసక్తిని ప్రదర్శిస్తున్నారు.
నాడు అన్నగారి మాదిరిగానే ఈసారి జగన్ కూడా బంపర్ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతారా. ఆ విధంగా జగన్ తన శపపధం నెరవేర్చుకుంటారా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో ఇపుడున్న పరిస్థితులు, పరిణామాలు చూసుకుంటే జగన్ కే అనుకూలంగా ఉంది. మరి నాడు అన్న గారి మాదిరిగా జనం మద్దతులో గెలిచి ఫిరాయింపు కంపు లేని సభలోకి జగన్ అడుగుపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. అదే జరిగితే జగన్ సరికొత్త చరిత్ర ఏపీ పాలిటిక్స్ లో  స్రుష్టించినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: