ఆంధ్రులకు వాస్తు దోషం బాగా ఉన్నట్లుంది. గత వందేళ్ళలో దేశంలో ఏ రాష్ట్రం అనుభవించని కష్టాలనీ ఆంధ్రులే పడుతున్నారు. మద్రాస్ ని ఎంతో అభివ్రుధ్ధి చేసి చివరకి దాన్ని రాజధాని చేసుకోకుండా కట్టుబట్టలతో విడిపోయిన నాటి నుంచి మొదలైన కష్టాలు ఇప్పటికీ తీరడంలేదు. మధ్యలో  ఉమ్మడి ఏపీలో కొంతబాగుందనిపించినా చివరికి అనుకున్నదే అయింది.


అడ్డగోలు విభజన :


ఈ మాట మన రాజకీయ పార్టీలు తరచూ అంటూ ఉంటాయి. కానీ అందరూ ఆ తానులో ముక్కలే. ఈ విభజనకు అందరూ కారకులే. చివరికి ఎటువంటి హక్కులు సాధించుకోకుండానే ఏపీ రెండు ముక్కలైంది. ఆదుకుంటామంటూ నాటి పాలకులు ప్రత్యేక హోదా నోటి మాటగా ఇస్తే అదే చట్టమని మురిసిపోయారు. చివరికి ఆ హోదా 2014లో చంద్రబాబు టీడీపీ అధికారంలోకి రావడానికి అపర సంజీవిని అయింది. మోడీతో జోడీ కట్టి హోదాను తెస్తామని చెప్పిన బాబుని జనం నమ్మి గెలిపించారు. చివరికి అయిదేళ్ళ తరువాత కూడా హోదా రాకపోగా మరో మారే అదే అంశం ఎన్నికల అస్రంగా మారుతోందంటే ఏపీ ఎంతటి విధి వంచితురాలో అర్ధమవుతోంది.


రాజకీయమే ముందు :


ప్రత్యేక హోదా అన్నది ఏపీకి అవసరం. పైగా విడగొడుతూ ఇచ్చిన ఉపశమనం. మరి దాన్ని సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాయా అంటే ఈ అయిదేళ్లలో లేదనే చెప్పాలి. మొదట్లో అవునని, మధ్యలో కాదని, మళ్ళీ ఎన్నికల వేళ హోదాయే ముద్దని టీడీపీ ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీరు చూస్తే తాను ఒంటరిగానే హోదా పోరు సాగిస్తోంది. ఆ పార్టీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించకపోయినా  సరైన ప్రణాలిక లేకుండా, ఎవరినీ కలుపుకోకుండా హోదాను ఎలా తెస్తారన్నది ఆ పార్టీ పెద్దలే చెప్పాలి. మిగిలిన పార్టీలు కూడా హోదాను నిచ్చెనలా చేసుకోవాలనే చూడడం ఏపీకి పట్టిన శాపంగానే చెప్పాలి.


అఖిలపక్షం నాటకం :


వేసిన నాటకం ఎవరూ మళ్ళీ వేయరు. కానీ టీడీపీ మాత్రం ఎపుడు ఎదుటి వారి అమాయకత్వాన్నే నమ్ముకుంటుంది. దానిలోనే తన విజయాన్ని చూస్తుంది. ఆ విధంగా ఇప్పటికి రెండు మార్లు అఖిల పక్షం పేరిట అలవి  కాని సమయాల్లో మీటింగులు పెట్టిన టీడీపీ ఇపుడు మాత్రం కరెక్ట్ టైమింగుతోనే సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఎన్నికలు ముంగిట్లో ఉన్నాయి. అందువల్ల హోదా చాంపియన్లు తామే కావాలన్న రాజకీయ స్వార్ధంతో ఈ మీటింగు జరుగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 



చంద్రబాబు ఏ మీటింగు పెట్టినా వైసీపీ వెళ్ళదు. అందునా వారికి పేటెంట్ లాంటి హోదా మీద మీటింగు అంటే అసలే రాదు. ఇక వైసీపీని ఒంటరిని చేసి మిగిలిన పార్టీలను పిలవాలనుకున్న టీడీపీ వ్యూహం ఇక్కడ  బెడిసికొట్టింది. మేము కూడా రామంటూ జనసేన షాక్ ఇచ్చింది. వామపక్షాలు, కాంగ్రెస్ ఇలా ఎవరూ రాని అఖిలపక్షం ఆదిలోనే హంసపాదు లా మారింది. అయినా ఇందులో  నుంచి కూడా క్రెడిట్ కొట్టేయాలని టీడీపీ చూస్తోంది. మాకే చిత్తశుద్ధి ఉందని చెప్పుకుంటోంది.


అక్కడ క్లైమాక్స్ :


ఈ ఎపిసోడ్ ని పొడిగిస్తూ డిల్లీలో చివరి అంకానికి తెర తీయాలని టీడీపీ మాస్టర్ ప్లాన్. డిల్లీ  వీధుల్లో బాబు హోదా పేరిట దీక్ష అన్నది మరో కొత్త డ్రామా అంటోంది ప్రతిపక్షం. అప్పట్లో సమైఖ్యాధ్ర ఉద్యమం చివరి దశలో బాబు డిల్లీలో నిరసన చేపట్టారు. ఏపీ విడిపోయినా బాబుకు అది అధికారం తెచ్చింది. ఈసారి హోదా పై దీక్ష పేరుతో లాస్ట్ పంచ్ తనదేనని బాబు చెప్పాలనుకుంటున్నారు. మరి విరుగుడుగా వైసీపీ ఏం చేస్తుందన్నది చూడాలి. మొత్తానికి హోదా అన్న దాని వల్ల లాభమేంటో జనాల్లో చాలా మందికి ఇప్పటికీ తెలియకపోయినా రాజకీయ నాయకులకు మాత్రం బాగా తెలుసు అన్నది మరో మారు ఇలా రుజువు అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: