రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో క‌ర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. కందనవోలు (క‌ర్నూలు) కోటపై పసుపు జెండా ఎగురవేయాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే జిల్లాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. కలిసొచ్చే ప్రతి అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో కొన్నిద‌శాబ్దాలుగా టీడీపీకి వైరి ప‌క్షంగా ఉన్న నాయ‌కులను కూడా పార్టీకి అనుకూలంగా మారుస్తున్నారు. ఈ ప‌రిణామంలో తాజాగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. కాంగ్రెస్‌తో 65 ఏళ్లకు పైగా అనుబంధాన్ని కోట్ల కుటుంబం వీడనుంది. 


వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను ప‌ట్టాలెక్కిస్తాన‌ని ఈ నెల మొద‌ట్లో కూడా చెప్పిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి తాజాగా మాత్రం ఆపార్టీకి బై చెప్పారు. దీంతో కోట్ల, ఆయన సతీమణి డోన్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి, తమ్ముడు కోట్ల గిరిధర్‌రెడ్డి కాంగ్రెస్‌కు జ‌ల్ల‌కొట్టి టీడీపీలోకి వ‌చ్చేందుకు ముహూర్తం కూడా నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఈ క్ర‌మంలోనే కోట్ల కుటుంబం టీడీపీ నుంచి చాలా ప‌ద‌వుల‌ను ఆశించినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.  కర్నూలు లోక్‌సభ సీటుతో పాటు ఆలూరు, డోన్‌ అసెంబ్లీ స్థానాలు భార్య కోట్ల సుజాతమ్మ, తనయుడు కోట్ల రాఘవేంద్రరెడ్డికి ఇవ్వాలని, కోడుమూరు అసెంబ్లీ స్థానం తాము సూచించిన అభ్యర్థికే ఇవ్వాలని కోట్ల ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే.. డోన్‌ నుంచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. 


ఈ పరిస్థితుల్లో కర్నూలు లోక్‌సభతో పాటు ఆలూరు అసెంబ్లీ స్థానాన్ని కోట్ల కుటుంబానికి ఇచ్చేందుకు చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కోట్ల రాఘవేంద్రారెడ్డికి రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవి ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆలూరు నుంచి ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. కోట్ల పార్టీలో వస్తున్న నేపథ్యంలో వీరభద్రగౌడ్‌ను అధి నాయకత్వం బుజ్జగించనున్నట్లు తెలుస్తోంది.


ఇక‌, ఇన్నాళ్లూ తమతో పాటు ఉన్న ముఖ్యనాయకులు, కార్యకర్తలను కూడా టీడీపీలోకి తీసుకెళ్లడానికి కోట్ల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  ఫిబ్రవరి 6న అధికారికంగా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు 30న కార్యకర్తల సమావేశం ఉంటుందని కోట్ల వర్గీయులు తెలిపారు.దీనిని స‌క్సెస్ చేసుకుని టీడీపీకి జైకొట్ట‌డం ద్వారా ఐదేళ్ల రాజ‌కీయ విరామానికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని కోట్ల భావిస్తున్నారు. అయితే, ఈ ప‌రిణామాలు జిల్లా టీడీపీ రాజ‌కీయాల్లో పెను ప్ర‌కంప‌న‌లు రేప‌నున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: