ఇదివరకులా అయిదేళ్ళకు ఎన్నికలు అయితే నెల ముందు హడావుడి ప్రారంభం కావడం, ఆ తరువాత పొలింగుకు ముందు వరకూ ఓటరు మనసు మార్చే పనులు చేయడం ఇపుడు లేదు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ చేతిలో వుంది. అంటే ప్రపంచంతో ప్రతి ఓటరూ అనుసంధానం అయినట్లే. వారికి అన్ని విషయాలు ఎవరూ చెప్పకుండానే తెలిసిపోతున్నాయి. దాంతో వారు తమ తీర్పును చాలా ముందుగానే రెడీ చేసిపెట్టుకుంటున్నారు.


అదే జరుగుతోంది :


గతంలో ఎన్నికలకు ముందు రోజు వరకూ రిపేర్లు చేసుకునే అవకాశం రాజకీయ పార్టీలకు ఉండేది. ఎక్కడైన తమకు బలహీనంగా ఉన్నట్లు అనిపించినా, లేక ఓటమి పాలు అవుతామని అనుమానాలు ఉన్నా వెంటనే రిపేర్లు చేసిపెట్టుకునే వారు. దాంతో ఓటమి గెలుపుగా మారేది ఇదంతా  చివరి నిముషం ప్రయత్నాలు అంటారు. అయితే గత కొన్ని ఎన్నికలను గమనిస్తే ఆ రిపేర్లు ఇప్పటి ఓటరు ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవనిపిస్తోంది. ఓటరుకు ఎవరూ కొత్తగా పాఠాలు నేర్పాల్సిన అవసరం కూడా లేదనిపిస్తోంది. వారు మనసులో ఓ నిర్ణయానికి వస్తే దాన్ని అమలుచేసేందుకు రెడీ అయిపోతున్నారు. అలాంటి తీర్పుని ఏ విధంగానూ అడ్డుకునే అవకాశాలు కూడా లేవనిపిస్తోంది.


తాయిలాలు ఇచ్చినా :


ఇక ఎన్నికలు అనగానే తాయిలాలు ఇవ్వడం, వరాల జల్లు కురిపించడం అనవాయితీగా  జరుగుతూ వస్తోంది. ఇది నిన్నటిది, నేటిదీ కాదు, ఎప్పటి నుంచో వస్తోంది. కానీ ఇప్పటి స్మార్ట్ ఓటర్లు మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అవన్నీ పక్కన పెట్టి అసలు కధ ఏంటో తమకు తెలుసు అంటున్నారు. అంటే ఓ ప్రభుత్వం గురించి ఎప్పటికపుడు అంచనా వేసుకునే అవగాహ‌న పెరగడంతో పాటు, తాము ఏ ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసే ట్రెండ్ ఇపుడు నడుస్తోందని అర్ధమవుతోంది. ఈ కారణంగానే దేశంలో బడా నాయకులు వచ్చి ఎన్నికల వేళ భారీ ప్రసంగాలు చేసినా కూడా అక్కడ ఓటరు తాను అనుకున్న ఫలితాన్నే  రాజకీయ పార్టీల నుదుట  రాసేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఉత్తరాది ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఫలితాలను ఎవరూ మార్చలేకపోయారు.


ఆ రోజులు పోయాయా :


అయిదేళ్ళు తాము అనుకున్నట్లుగా పాలన చేసి చివరి నిముషంలో బెల్లం ముక్క నోట్లో పెట్టి పోలింగ్ దాక నడిపించి ఓట్లు వేయించుకునే రోజులు ఇపుడు దాదాపుగా లేవనే అంటున్నారు. ఇంకా చెప్పాలంటే భారతీయ ఓటరు ఎపుడూ తెలివైన వాడే. ఎమర్జెన్సీ రోజుల్లోనే  ఏ పార్టీని ఎన్నుకోవాలో తెలిసిన భారతీయ ఓటరు స్మార్ట్ యుగంలో తనకు నచ్చిన పాలకున్ని కూర్చోబెట్టుకునే తెలివిడి లేకుండా ఉంటాడా. ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ మేధస్సు ఇప్పటి ఓటర్లకు ఉంది. వారి వద్ద అన్ని రకాల గణాంకాలు కూడా ఉన్నాయి. ఎవరు వచ్చి ఏం చేశారు, ఎవరి వల్ల అభివ్రుధ్ధి జరిగింది. ఎవరి వల్ల రేపటి రోజున జరుగుతుంది ఇవన్నీ ఓటరుకు తెలిసినంతగా ఎవరికీ తెలియవంటే అతిశయోక్తి కాదేమో.  


అతి పెద్ద విస్పోటనమే :


అయినా సరే ఓటరు తాను మౌన మునిలాగానే ఉంటాడు. ఆ మౌనం నుంచే అతి పెద్ద విస్పోటనాన్ని స్రుష్టిస్తాడు. దాన్ని తట్టుకోగల శక్తియుక్తులు ఉన్న వారే రేపటి ఎన్నికల్లో నిలబడగలరు. అందువల్ల  భారతీయ ఓటరుని తక్కువ అంచనా వేయడం ఈరోజుల్లో కుదరని పని. ఎవరు అలా చేసిన తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక మరో రెండు నెలల్లో ఏపీతో సహా దేశంలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఓటరు తీర్పు ఇప్పటికే రెడీ అయిపోయింది. ఈవీఎమ్ మీట నొక్కడమే ఇక మిగిలింది. అందువల్ల ఈ మధ్యలో రాజకీయ పార్టీలు ఏం వరాలు కురిపించినా ఓటరు ఆలొచనలు మారవు.  తీర్పు రిజర్వ్ చేయబడింది... తస్మాత్ జాగ్రత్త పొలిటికల్ పార్టీస్.


మరింత సమాచారం తెలుసుకోండి: