కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ తో ఏపి బిజపి నేతలపై నెత్తిన పిడుగు పడినట్లే అనుకోవాలి. ప్రవేశపెట్టిన ఐదు బడ్జెట్లలో ఏపి ప్రయోజనాల విషయంలో కేంద్రం ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేవీ లేవని తేలిపోయింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల ముందు వచ్చిన బడ్జెట్ కాబట్టి ఏపి ప్రయోజనాలపై ఏమన్నా కేటాయింపులుంటాయేమోనన్న ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్ సాంతం చూసిన తర్వాత వస్తాయని అనుకున్న నాలుగు సీట్లు కూడా రావన్న విషయం అర్ధమైపోయింది.

 

పోయిన ఎన్నికల్లో ఏపిలో బిజెపికి నాలుగు అసెంబ్లీ సీట్లు, రెండు లోక్ సభ స్ధానాలు వచ్చాయి. మళ్ళీ ఆ స్ధానాలను తిరిగి గెలుచుకుంటే చాలనే పరిస్దితిలో ఉంది బిజెపి. ప్రత్యేకహోదాకు మించి ప్యాకేజి ఇచ్చిందని, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తుందని, ఏపి అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని కాకమ్మ కథలు చెప్పుకుంటూ ఏదోలా నాలుగున్నరేళ్ళు నెట్టుకొచ్చేశారు.

 

హోదా లేదు ప్యాకేజీ లేదని అందరికీ అర్ధమైపోయినా బిజెపి నేతలు మాత్రం సమర్ధించుకుంటున్నారు. ప్రత్యేక రైల్వేజోన్ కేంద్రం పరిశీలనలో ఉందని బుకాయించారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్ధలను కేటాయించామని చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు. నిజానికి విద్యాసంస్ధలను విభజన చట్టంలో ఉన్నవి మాత్రమే ఇచ్చారు. అంతకుమించి ఏమీ ఇవ్వలేదు. రైల్వేజోన్ ఇవ్వటం సాధ్యం కాదని కేంద్రం ఎప్పుడో తేల్చేసినా స్ధానిక నేతలు మాత్రం సమర్ధించుకుంటున్నారు. చివరకు తాజా బడ్జెట్ చూసిన తర్వాత ఉన్న కాస్త ఆశలు కూడా ఆవిరైపోయింది. దాంతో వచ్చే ఎన్నికల్లో బిజెపికి అసెంబ్లీ, పార్లమెంటు స్ధానాల్లో అసలు బోణి కొడుతుందా అన్న అనుమానం పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: