ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మోదీ సర్కార్ ఓట్లకోసం పెద్ద స్కెచ్చే వేసింది. పూర్తిగా ఎన్నికల కోసమే బడ్జెట్ రూపొందించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. రైతులు, ఉద్యోగుల ఓట్లే లక్ష్యంగా వారిపై వరాల వర్షం కురిపించింది. రైతులకు రుణమాఫీ చేస్తారని వార్తలు వచ్చినా, దానికి భిన్నంగా పెట్టుబడి సాయం అందించేందుకు మోదీ సర్కార్ మొగ్గు చూపింది. అదే సమయంలో ఇన్ కం ట్యాక్స్ స్లాబుల్లో భారీ మార్పులు వేతన జీవులకు పెద్ద ఊరట కల్పించేవే!

Image result for piyush goyal budget

ఎన్నికలు మరో మూడు నెలల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ఎవరూ సాహసం చేయరు. ప్రజలపై భారం మోపేందుకు ఎవరికీ ధైర్యం సరిపోదు. మోదీ కూడా ఇదే బాటలో నడిచారు. సంక్షేమ భారత్ లక్ష్యంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నింపేశారు. అరుణ్ జైట్లీ బదులు బడ్జెట్ ప్రవేశపెట్టిన తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగం మొత్తాన్ని వరాలతోనే నింపేశారు. ముఖ్యంగా దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతులకోసం గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీని ప్రకటించింది మోదీ సర్కార్. గతంలో యూపీఏ హయాంలో ఓసారి రైతులకు రుణమాఫీ చేసింది. దాంతో రైతులు ఊరట పొందారు. ఈ దఫా కూడా మోదీ అలాంటి రుణమాఫీతో ఊరట కల్పిస్తారని అందరూ భావించారు. ఇటీవలికాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే రైతులు పెద్దఎత్తున ధర్నాలు చేశారు. ముంబై, ఢిల్లీ కేంద్రంగా కిసాన్ ర్యాలీలు పెద్దఎత్తున జరిగాయి. రైతులను ఆదుకోకపోతే ఇబ్బంది తప్పదని పాలక పార్టీ గ్రహించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి పథకంతో ముందుకెళ్తే రైతులకు లబ్ది చేకూరుతుందో ఆలోచించి చివరకు నగదు బదిలీకే ఓటేసింది మోదీ సర్కార్. ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున నగదు అందించేలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. 2018 డిసెంబర్ 1వ తేదీ నుంచే  ఇది అమల్లోకి వస్తుంది. 2019 మార్చి నాటికి రూ.2000 లు జమ చేసేందుకు సిద్ధమైంది.

Image result for farmers budget

 ఇక వేతన జీవులకు పెద్ద ఊరటే దక్కింది. గతంలో రూ.250000 వరకూ పన్ను మినహాయింపు ఉండేది. ఆ పై మొత్తానికి 10 శాతం నుంచి 30 శాతం వరకూ పన్నులుండేవి. తాజాగా ఆ మొత్తాన్ని రూ.500000 లకు పెంచారు. అంటే రూ.5 లక్షల ఆదాయం వరకూ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మరో రూ.1.5లక్షల వరకూ వివిధ పథకాల ద్వారా లబ్ది చేకూరనుంది. ఇది కచ్చితంగా వేతన జీవులకు పెద్ద ఊరట కల్పించే నిర్ణయమే.! ఇటీవల పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మోదీ సర్కార్ నిర్ణయించింది. కనీసం రూ.8 లక్షల వార్షికాదాయం ఉండేవాళ్లు ఈ రిజర్వేషన్లకు అర్హులను తేల్చింది. ఈ నేపథ్యంలో పన్ను మినహాయింపులను కూడా అనివార్యంగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుశా ఈబీసీ రిజర్వేషన్లకోసం ఈ మొత్తం మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల మాట.

Image result for tax exemption

మొత్తంగా మోదీ ఎన్నికల బడ్జెట్ ప్రసంగించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లా కాకుండా అకౌంట్ ఫర్ ఓట్ బడ్జెట్ లా ఇది ఉందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చే పతకం కావడంతో తప్పకుండా ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని పలువురు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: