టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్‌గా మారిపోయారు. ఖాకీ చొక్కా వేసుకుని ఇద్దరు మహిళలను కూర్చోబెట్టుకుని ఆటో నడిపారు.  తనను కలిసేందుకు వచ్చిన ఆటోవాలాలతో కలిసిపోయారు.  ఇటీవల ఆటోలపై జీవిత కాల పన్ను ఎత్తివేస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల ఆటోవాలాలు హర్షం వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నివాస ప్రాంగణంలో పసుపు జెండాలతో ఆటోల ప్రదర్శన నిర్వహించారు.
'ఆటో' చంద్రన్న.. డ్రైవర్లకు పెద్దన్న.. కొత్త గెటప్‌లో బాబు..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రోడ్డు పన్ను రద్దు కేవలం ఆరంభం మాత్రమేనని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఇంకా ఎన్నో చేస్తానని హామీ ఇచ్చారు. రూ.140 కోట్ల నష్టం వస్తుందని చెప్పినా... ఆటో డ్రైవర్లకు భారం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఏపి అభివృద్ది పట్టించుకోవడం మానేసిందని..రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు ఉన్నా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో అన్నీ ఎలక్ట్రికల్ వాహనాలే ఉంటాయన్నారు. 

ఒక ప్రయాణికుడు ఆటో ఎక్కితే..వారి గమ్యస్థానాన్ని సరిగా చేర్చడానికి ఆటోవాలా ఎలా ఆలోచిస్తారో..రాష్ట్రాన్ని నడిపించే డ్రైవర్ గా ప్రజలకు మంచి చేయాలని తాను భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 3.75 లక్షల మంది ఆటో డ్రైవర్లకు భవిష్యత్‌లో బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఇందుకోసం ఆటో డ్రైవర్లు అంతా కలిసి ఒక యూనియన్‌గా ఏర్పడాలని ఆయన సూచన చేశారు. ఇంధన ఛార్జీలు, ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఆటోడ్రైవర్లందరికీ పెద్దన్నగా తానుంటాన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: