సీనియర్‌ రాజకీయ నేత, ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావుకు వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లిలో గెలుపు సాధ్యమవుతుందా ? కోడెల గెలుపు చుట్టు ముట్టిన సెంటిమెంట్లు ఏంటి ? దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆ సెంటిమెంట్లు రిపీట్‌ అయితే కోడెల సత్తెనపల్లిలో ఓడిపోతారా ? లేదా ఆ సెంటిమెంట్లను కోడెల బ్రేక్‌ చేస్తారా ? కోడెల తిరిగి సత్తెనపల్లిలో పోటీ చేస్తాడా ? లేదా ఆయన పాత నియోజకవర్గమైన నరసారావుపేట మారిపోతారా ? ఇవే చర్చలు ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ‌నీయాంశం అయ్యాయి. అసలు విషయంలోకి వెళ్తే నరసారావుపేట నుంచి ఐదు సార్లు వరస విజయాలు సాధించి 2004, 2009 ఎన్నికల్లో ఓడిన కోడెల గత ఎన్నికల్లో సత్తెనపల్లికి మారి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 700 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.
Image result for ambati rambabu
సత్తెనపల్లిలో ఉన్న కోడెలకు వచ్చే ఎన్నికల్లో అక్కడే తిరిగి పోటీ చేస్తే గెలిచేందుకు అంత సానుకూల అంశాలు లేవన్న ప్రచారం కూడా జరుగుతుంది. 
ఇందులో కోడెల స్వయంకృత అపరాధం కూడా చాలా వరకు ఉంది. అదే టైమ్‌లో కోడెల ఇటు సత్తెనపల్లితో పాటు అటు నరసారావుపేట నియోజకవర్గ రాజకీయాల్లో ఉంటూ రెండు పడవల మీద కాళ్లు వేస్తు వస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన సీనియార్టి దృష్ట్యా చంద్రబాబు కాదనలేకపోయినా వచ్చే ఎన్నికల వేళ‌ అయినా కోడెలను ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితం చెయ్యాలని రెండో నియోజకవర్గంలో ఆయన హవాకు చెక్‌ పెట్టాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కోడెల తిరిగి సత్తెనపల్లిలో పోటీ చేస్తారా లేదా నరసారావుపేటకు మారతారా ? అన్నది పైకి చెప్పకపోయినా ఆయన మనసులో ఏమున్నది మాత్రం ఎవరికి అంతు పట్టడం లేదు. కొందరు కోడెల తిరిగి సత్తెనపల్లిలో పోటీ చేస్తారని కాదు కాదు ఆయన నరసారావుపేటకు వెళ్లిపోతారని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు.


సెంటిమెంట్‌ రిపీట్‌ అయితే కోడెల కథ సమాప్తమే..!
ఇదిలా ఉంటే కోడెల తిరిగి సత్తెనపల్లిలో పోటీ చేస్తే ఆయన గెలుపునకు కొన్ని సెంటిమెంట్లు అడ్డంకిగా మారే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఈ సెంటిమెంట్లను ఆయన చేధిస్తారా లేదా అన్నది పక్కన పెడితే చరిత్ర చెబుతున్న సత్యాన్ని బట్టి చూస్తే కోడెల ఆ సెంటిమెంట్‌కు బలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల విభజన జరిగాక కూడా స్పీకర్‌గా పని చేసిన వారు ఆ తర్వాత రాజకీయంగా తెరమరుగయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో వారు ఓటమి పాలయ్యారు... లేదా వారి జీవితం అనూహ్య కారణాల వల్ల ముగిసిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే ఎస్సీ మహిళా కోటాలో స్పీకర్‌గా పని చేసి రికార్డు సృష్టించిన కావలి ప్రతిభా భారతి గత మూడు ఎన్నికల్లోనూ వరసగా ఓడిపోతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజాం నుంచి ఆమెకు పోటీ చేసే ఛాన్స్‌ కూడా లేదు. దీనిని బట్టీ చూస్తే ప్రతిభా భారతి పొలిటికల్‌ కెరియర్‌ దాదాపు ముగిసినట్టే కనపడుతోంది. 


2004లో స్పీకర్‌గా మంచి మార్కులు వేయించుకున్న కేఆర్‌. సురేష్‌ రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో వరసగా ఓడారు. ఇక తెలంగాణలో గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు చివరకు పార్టీనే మారిపోయారు. ఆ తర్వాత స్పీకర్‌గా పని చేసిన మాజీ ముఖ్య మంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి జై సమైక్యాంధ్ర‌ పార్టీ పెట్టి రాజకీయంగా డిజాస్టర్‌ షో వేసి తిరిగి కాంగ్రెస్‌ గూటికే చేరారు. ఇప్పుడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి పరిస్థితి కూడా అగమ్యఘోచరంగానే ఉంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి స్పీకర్‌గా పని చేసిన నాదెండ్ల మనోహర్‌ సైతం గత ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన జనసేనలో ఉన్నా మనోహర్‌ పొలిటికల్‌ గ్రాఫ్‌ అంత సానుకూలంగా ఉన్నట్లు అయితే కనపడడం లేదు. ఇక ఈ సెంటిమెంట్ కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ద‌క్షిణాదిలో ప‌లు రాష్ట్రాల్లోనూ రిపీట్ అవుతూ వ‌స్తోంది. స్పీక‌ర్‌గా ఉన్న దుద్దిళ్ల శ్రీపాద‌రావు న‌క్స‌లైట్ల చేతుల్లో హ‌త్య‌కు గుర‌య్యారు. ఇక లోక్‌స‌భ స్పీక‌ర్‌గా ఉన్న బాల‌యోగి ప్ర‌మాదంలో హ‌ఠాన్మ‌ర‌ణం పాల‌య్యారు.


ఇక రెండు తెలుగు రాష్ట్రాలు విభజన జరిగాక తెలంగాణ తొలి స్పీకర్‌గా పని చేసిన సిరికొండ మధుసూదనాచారి తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి ఓడిపోయారు. ఇక ఈ సెంటిమెంట్లను బట్టీ చూస్తే సత్తెనపల్లిలోనూ స్పీకర్‌ గెలుపు సులువుగా కనిపించడం లేదు. దీనికి తోడు స్థానికంగా ఆయనపై ఉన్న వ్యతిరేఖత నేపథ్యంలో కూడా సంచలనం జరిగే ఛాన్సులు ఉన్నట్టు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి తోడు సత్తెనపల్లిలో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్‌ కూడా ఉంది. మరి ఈ లెక్కన చూస్తే సత్తెనపల్లిలో పోటీ చేసి ఈ సెంటిమెంట్లకు బ్రేక్‌ వేస్తారా ? లేదా నరసారావుపేటలో పోటీ చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.


మరింత సమాచారం తెలుసుకోండి: