ఏపీలో రానున్న ఎన్నిక‌ల్లో అత్యంత ఆస‌క్తి గొలుపుతున్న నియోజ‌క‌వ‌ర్గం ఏదైనా ఉందంటే మండ‌పేట ప్ర‌థ‌మ‌స్థానంలో ఉంటుంది. ఇక్క‌డ  ప్ర‌ధానంగా టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన అభ్య‌ర్థుల మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే బీజేపీ కూడా పోటీలో ఉన్నా ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాద‌న్న‌ది స‌త్యం. మిగిలిన మూడు పార్టీల అభ్య‌ర్థుల మ‌ధ్య హొరాహోరీ త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నా ఇక్క‌డ జ‌న‌సేనకు గెలిచే స్కోప్ లేదు. అదే టైంలో ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్థి మిగిలిన అభ్య‌ర్థుల త‌ల‌రాత‌ల‌ను మార్చ‌డం మాత్రం ఖాయం. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ చైత‌న్యం కాస్త ఎక్కువే. అందుకే తాయిలాలు ఇవ్వ‌డానికి అభ్య‌ర్థులు కూడా కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే పెట్టుబ‌డిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అందుక‌నే ఇప్ప‌టి నుంచే స‌ద‌రు స్థానం టికెట్‌ను ఆశిస్తున్న నేత‌లు  ఆప‌నిలో నిమ‌గ్న‌మైన‌ట్లు స‌మాచారం. 


వాస్త‌వానికి ఇక్క‌డ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి మొదటి నుంచి అన్ని పార్టీలు చాలా ప్రాధాన్య‌మిస్తూ వ‌స్తున్నాయి. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఈ సారి వైసీపీ మాత్రం బీసీ అభ్య‌ర్థికి  టికెట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.  మ‌రి ఈ ఎన్నిక‌ల్లో ఎలా ఉండ‌బోతున్న‌ది కూడా ఆస‌క్తి క‌లిగిస్తోంది. ఇక్క‌డ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగిశ్వ‌ర‌రావు బ‌రిలో నిల‌వ‌డం ఖాయ‌మై పోయింది. ఇక వైసీపీ నుంచి బీసీ వ‌ర్గానికి చెందిన  పితాని వెంక‌టేశ్వ‌ర్లు దాదాపుగా ఖరైరైంది. కాకినాడ‌లో ఉండే ఈయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంపై మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో ప‌ట్టు దొర‌క‌లేద‌ని తెలుస్తోంది. దిగువ స్థాయి నేత‌లు ఆయ‌న‌కు ఎంత‌వ‌ర‌కు స‌హ‌క‌రిస్తార‌నేది కూడా అనుమానాస్పందంగా మారింది. ఇక్క‌డ గ‌తంలో వైసీపీ త‌ర‌పున ప‌నిచేసిన కోఆర్డినేట‌ర్ల‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్ట‌డంతో ఆ వ‌ర్గం వాళ్లు వైసీపీకి స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు. అయితే బీసీ వ‌ర్గానికి మంచి ఓటు బ్యాంకు ఉండ‌టం మ‌ట్టుకు వైసీపీకి కొంత క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. 
అయితే వారిని క్రాస్ ఓటింగ్ బెడ‌ద మాత్రం వెంటాడుతోంది.  


జ‌న‌సేన పార్టీ నుంచి వేగుళ్ల లీలాకృష్ణ‌, మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంక‌టేశ్వ‌ర్లు, పిల్లా స‌త్య‌నారాయ‌ణ‌లు రేసులో ఉన్నారు. ముగ్గురి మ‌ధ్య కూడా గ‌ట్టి పోటీ ఉంద‌నే చెప్పాలి. నియోజ‌క‌వ‌ర్గంలో కాపు ఓట‌ర్లు కూడా గ‌ట్టిగానే ఉండ‌డంతో వారికి మిగిలిన వ‌ర్గాల నుంచి ఎంత‌వ‌ర‌కు స‌పోర్ట్ ల‌భిస్తుంద‌న్న‌ది ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అంచ‌నా వేయ‌లేం. ఇక కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ స‌భ్యులు కామ‌న ప్ర‌భాక‌ర్‌రావు, బీజేపీ నుంచి కోన స‌త్య‌నారాయ‌ణ‌కు టికెట్ ల‌భిస్తుంద‌ని తెలుస్తోంది.

టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగిశ్వ‌ర‌రావు బ‌రిలో నిలవ‌డం ఖాయం కావ‌డంతో ఆ పార్టీలో కొంత జోష్ క‌న‌బ‌డుతోంది. గ‌త రెండు ప‌ర్యాయ‌లు కూడా ఆయ‌న ఈ స్థానం నుంచి పోటీ చేసి గెల‌వ‌డం విశేషం. 2009ఎన్నిక‌ల్లో 13 వేల పైచిలుకు మెజార్టీ సాధించిన ఆయ‌న 2014లో మాత్రం 37వేల పైచిలుకు మెజార్టీ సాధించారు. ఈ గ‌ణాంకాలు ఆయ‌న‌కున్న ప్ర‌జాబ‌లాన్ని తెలియ‌జేస్తున్నాయ‌నే చెప్పాలి. అయితే ఇందులో త‌గ్గినా మొత్తంగా మాత్రం ఆయ‌న గెలుపు సాధించ‌డానికి అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: