మోడీ కేంద్రంలో బలమైన నాయకుడు, చంద్రబాబు ఏపీలో బలమైన నాయకుడు. ఇద్దరూ కలసి 2014లో జట్టు కట్టి మా జోడీ బంపర్ హిట్ అనిపించారు. జనం కూడా దాన్ని గొప్పగా  రిసీవ్ చేసుకున్నారు. బాగా ఓట్లు, సీట్లు ఇచ్చి రెండు చోట్లా అధికారం కట్టబెట్టారు. నాలుగేళ్ళ పాటు కలసి పని చేసిన బీజేపీ, టీడీపీ పొత్తులు ఏడాది క్రితమే పెటాకులు అయ్యాయి. ఇపుడు బాబు, మోడీ శత్రువుల కంటే ఎక్కువగా యుద్ధం చేస్తున్నారు. 


ఏపీ సంగతేంటి  :


ఏపీ విషయం తీసుకుంటే కేవలం అయిదేళ్ళ ప్రాయం కలిగిన పసి పాప. విభజన కష్టాలు గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఓ వైపు ఘోరంగా  విభజించిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు ప్రత్యేక హోదా ఇస్తామంటూ జండూ బాం పూస్తోంది. ఆ పార్టీ మీద ఏపీ జనానికి ఇప్పటికీ పీకల మీద కోపం ఉంది. మరో వైపు రేపటి ఎన్నికల్లో కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తారని అన్ని జాతీయ  సర్వేలు చెబుతున్నాయి. ఇక బాబు మోడీతో గొడవ పెట్టుకుంటున్నారు. అందువల్ల రేపటి ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే మరో అయిదేళ్ళ పాటు ధర్మ పోరాట దీక్షలేనా అన్నది ప్రజలను పట్టి పీడిస్తున్న సందేహం. కేంద్ర సాయం ఏమీ లేక  మరో అయిదేళ్ళు ఇలాగా ఉండాలా అన్న బాధ కూడా వ్యక్తం అవుతోంది.


రాహుల్ మీద అప నమ్మకం :


ఇక బాబు చెబుతున్న కాంగ్రెస్ కూటమి మీద ఏపీ జనాలకు అంతగా విశ్వాసం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధినేత రాహుల్ రాజకీయ పరిపక్వతపై ఎన్నో డౌట్లు ఉన్నాయి. ఆయన్ని ఇంకా అనుభవం లేని నేత‌గానే  ప్రజలు చూస్తున్నారు. ఇక సర్వేలు చూసుకున్నా కాంగ్రెస్ కి వంద కంటే ఎక్కువ ఎంపీ సీట్లు రావని అంటున్నారు. ఆ టైంలో కాంగ్రెస్ ని రాహులు ని ముందు పెట్టి ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇవ్వవన్నది అందరికీ తెలిసిందే. మరో వైపు ప్రాంతీయ పార్టీలకు అధికారం దక్కడం కూడా అనుమానమే 


ఒకవేళ దక్కినా అది 1996 నాటి మాదిరిగానే ఏడాది మించి నిలబడదన్నది కూడా జనం ఎరిగిన సత్యమే. ఇక ప్రాంతీయ పార్టీలు కట్టిన కూటమి రేపు అధికారంలోకి వచ్చిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందన్నది ఉత్త మాటేనని అంటున్నారు. నిజానిక్ ఏపీకి హోదా ఇవ్వడాన్ని తమిళనాడు, కర్నాటక. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఎపుడో వ్యతిరేకించాయి. బీహార్, ఒడిషా వంటి రాష్ట్రాలు తమకే ముందు ప్రత్యేక  హోదా కావాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి ఇటువంటి సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అంటూ బాబు కేంద్రంలోని రాహుల్ ని చూపించి ఓట్లు అడిగితే ఇక్కడ ఏపీ జనం నమ్ముతారా,  హోదాకు కలసి రాని ప్రాంతీయ పార్టీలతో జట్టు కడితే ఓట్లేస్తారా..  మరో మారు టీడీపీని అధికారంలోకి తెస్తారా అన్నది డౌటే.


ఆ ప్రచారం లాభమేనా :


ఇక మరో వైపు జగన్, మోడీ కలసిపోయారని టీడీపీ చేస్తున్న ప్రచారం ఆ పార్టీకి బూమరాంగ్ కాగా, అంతిమంగా రేపటికైనా వైసీపీకి, జగన్ కి లాభమే చేకూరుతుందని అంటున్నారు. ఎందుచేతనంటే మోడీ బాబు బద్ద శత్రువులుగా ఉన్నందునే ఏపీకి ప్రత్యేక హోదా, ఇతన విభజన హమీలు రావడంలేదన్నది సగటు ప్రజల్లో బలంగా అభిప్రాయం ఇప్పటికే  గూడు కట్టుకుంది. పైగా ఈ ఇద్దరు నేతలూ రోడ్ల మీదకు వచ్చి నిత్యం పోరాటం చేయడాన్ని గత ఏడాదిగా జనం చూసి విసిగివున్నారు. మళ్ళీ మోడీ వస్తాడని సర్వేలు అంటున్న వేళ ఇక్కడ జగన్ని ఎన్నుకుంటే కేంద్ర సహకరం ఉంటుందని సగటు ఏపీ ప్రజలు  ఈ సమయంలో భావించినా ఆశ్చర్యం లేదు. 


ఏపీలో తటస్తులకు, రాజకీయాలతో సంబంధం  లేని వారికి ఇదే అనిపిస్తోందని అంటున్నారు. ఇపుడున్న పరిస్తితుల్లో ఏపీలో జనం రాజకీయాలు కోరుకోవడం లేదు. పైగా విభజనతో దారుణంగా నష్టపోయినా ఏపీ విషయంలో ప్రయోగాలు కూడా చేయదలచుకోవడంలేదు. అందువల్ల మోడీ, జగన్ జోడీకి జనం జై కొట్టినా అందులో వింత ఏమీ లేదు కూడా. ఈ టైంలో మోడీ గ్రాఫ్ ఎంత పెరిగితే అంతగా జగన్ విజయావకాశాలు కూడా పెరుగుతాయి. అదే టైంలో ప్రాతీయ పార్టీల దూకుడు, రాహులు విషయంలో బాబు ఎంతలా వెనకేసుకువస్తే అంతలా టీడీపీకి ఇబ్బందులు వస్తాయని కూడా విశ్లేషిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: