ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు కూడా గడువు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్క సారిగా వెడెక్కింది. అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీలో ఎవరెవరు ఏ ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారన్న దానిపై రెండు పార్టీలో తీవ్రమైన కసరత్తులు, తర్జన భ‌ర్జనలు జరుగుతున్నాయి. అధికార టీడీపీలో సీట్ల కోసం ఒకింత పోటీ ఎక్కువగానే కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చేయడంతో వారంతా ఎన్నికల ప్రచార కార్యక్షేత్రంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. సీఎం చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చెయ్యడం అంటే ఓ పట్టాన తేలనివ్వరన్న టాక్‌ ఉంది. గత మూడు ఎన్నికల నుంచి ఆయన అభ్యర్థుల ఎంపికలో చివరి వరకు నాన్చుతూ నాన్చుతూనే వస్తున్నారు. అయితే గతంలో ఎన్నడు లేని విధంగా ఇప్పుడు ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. 


నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను చూస్తే నెల్లూరు ఎంపీ టిక్కెట్‌పై నాలుగున్నర ఏళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు చంద్రబాబు తెరదించారు. నెల్లూరు లోక్‌సభ సీటుకు, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి పార్టీ తరపున నాలుగేళ్లుగా ఇన్‌చార్జుగా వ్యవహిరిస్తు వస్తున్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డిని రూరల్‌ నుంచి పోటీకి దింపారు. అదే టైమ్‌లో నెల్లూరు ఎంపీ సీటును వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జ‌డ్పీచైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి కేటాయించారు. కావలి నుంచి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, సర్వేపల్లి నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఆత్మకూరు నుంచి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణ పేర్లను ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీరిలో కురుగొండ్ల రామకృష్ణ ఇప్పటికే వెంకటగిరి నుంచి రెండు సార్లు వరుస విజయాలు సాధించగా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కోసం ఆయన రెడీ అవుతున్నారు. అక్కడ నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని రామకృష్ణ ఢీ కొడుతున్నారు. 


ఇక పంచపాండవులు పోటీ పడుతున్న ఆత్మకూరు నుంచి మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామిక వేత్త బొల్లినేని కృష్ణయ్య అయితేనే కరెక్ట్‌ అని భావించిన చంద్రబాబు ఆయన పేరు ఖరారు చేశారు. ఇక ఆత్మకూరు నుంచి పోటీ చెయ్యాలని భావించిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని నెల్లూరు ఎంపీగా రంగంలోకి దించాలని డిసైడ్ చేశారట. కీలకమైన నెల్లూరు ఎంపీ టిక్కెట్‌ విషయంలో ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, బీదా మస్తాన్‌రావు పేర్లు వినిపించినా చివరకు రాఘవేంద్రరెడ్డిని అక్కడ సర్దుబాటు చెయ్యాలని చంద్రబాబు డిసైడ్‌ చేసారట.

ఇక టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అయినా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి (కోవూరు), బొల్లినేని వెంకటరామారావు(ఉదయగిరి) సీట్లపై త్వరలో క్లారిటీ రానుంది. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేఖత నేపథ్యంలో వీరినే కంటిన్యూ చేస్తారా ? లేదా చిన్న చిన్న సర్దుబాటు చేసి వీరినే కంటిన్యూ చేస్తారా ? లేదా ఈ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారా ? అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా నెల్లూరు జిల్లాలో అభ్యర్థుల ప్రకటనపై క్లారిటీ రావడంతో టీడీపీలో సగం కన్‌ఫ్యూజన్‌ తొలిగిపోయినట్లు అయ్యింది


మరింత సమాచారం తెలుసుకోండి: