రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించాలన్న ఇంట్రస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం లేదని చంద్రబాబునాయుడు పుత్రరత్నం నారా లోకేష్ తాజాగా సెలవిచ్చారు. ఢిల్లీ ఏపి భవన్లో లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రానికి హోదాను సాధించాలని జగన్ కు వైసిపికి లేకపోవటం నిజంగా దురదృష్టకరమన్నారు. గుంటూరుకు వచ్చిన మోడిని వైసిపి నేతలు హోదా విషయంలో నిలదీయకపోవటంతోనే మోడి-జగన్ జోడి ఒకటేనని ప్రజలకందరికీ అర్ధమైపోయిందట.

 

పైగా గుంటూరు బహిరంగ సభకు వైసిపి ఎంఎల్ఏలే ప్రధానమంత్రికి స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు పెట్టారట. బహిరంగసభకు వైసిపి నేతలే జనాలను తోలారట. మోడి, జగన్ జోడి ఒకటేనని చెప్పటానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదని లోకేష్ సెలవిచ్చారు. వేదిక మీదున్న బిజెపి నేతల్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ప్రత్యేకహోదా కోసం ప్రధానిని అడగలేదని బోల్డు బాధపడిపోయారు.

 

రాబోయే ఎన్నికల్లో వైసిపి, బిజెపిలకు జనాలు తగిన గుణపాఠం చెబుతారని లోకేష్ చెప్పారు. మరి నాలుగేళ్ళ పాటు ప్రత్యేకహోదా కోసం జగన్ చేసిన పోరాటాలను మాత్రం లోకేష్ మరచిపోయినట్లున్నారు. బహుశా మతిమరుపేమన్నా లోకేష్ ను ఇబ్బంది పెడుతోందేమో ? అదే సమయంలో నాలుగేళ్ళపాటు ప్రత్యేకహోదా కన్నా ప్యాకేజీనే మిన్న అని చెప్పిన విషయాలను కూడా లోకేష్ కన్వీనియంట్ గా మరచిపోయినట్లు నటిస్తున్నారు. లోకేష్ చెప్పినట్లే రాబోయే ఎన్నికల్లో జనాలు బుద్ధి చెప్పటం ఖాయమే. కాకపోతే ఎవరికి అన్నదే ప్రధాన సమస్య.


మరింత సమాచారం తెలుసుకోండి: