అవును! ఎన్నిక‌ల వేళ‌.. జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఆ పార్టీకి మ‌రిన్ని స‌మ‌స్య‌లు తెస్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకివెళ్తే.. రానున్న ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేలు అడగాలని జగన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.  ‘ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలు తీసుకోండి. రూ.3 వేలు కాదు రూ.5 వేలు ఇవ్వాలని అడగండి. అవినీతి సొమ్ము తీసుకుంటే ఏ దేవుడూ చంద్రబాబుకు ఓటేయమని చెప్పడు’ అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబు అత్యంత దారుణంగా దిగజారిపోతున్నారని విమర్శించారు. బాబు చేసేవన్నీ డ్రామాలు, సినిమా షోలేనని ఎద్దేవా చేశారు. దేవుని దయ, ప్రజల ఆశీర్వాదంతో మరో మూడు నెలల్లో తానే ముఖ్యమంత్రి అవుతానన్నాడు.


వాస్త‌వానికి రాష్ట్రంలో రాజ‌కీయాలు వేడెక్కిన నేప‌థ్యంలో ఎవ‌రు ఎలాంటి వ్యాఖ్య‌లు చేసినా ఓకే అవుతుంది. కానీ, ఎన్నిక ల‌నే అప‌హాస్యం చేసేలా.. కేవ‌లం చంద్ర‌బాబు మాత్ర‌మే డ‌బ్బులు పంచుతున్న నాయ‌కుడి మాదిరిగా జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌చారం.. ఇస్తున్న పిలుపు కూడా తీవ్ర నిర‌స‌న‌కు దారితీసే ప‌రిస్థితి వ‌స్తోంద‌ని అంటున్నారు ప్ర‌జాస్వామ్య వాదులు. బాధ్య‌తాయుత‌మైన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్న జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌ను ఈ విధంగా ప్రోత్స‌హించ‌డం ఏంటి? అనేది వీరి ప్ర‌ధాన ప్ర‌శ్న‌. నిజానికి అదికార పార్టీ ఓట్ల‌ను కొనుగోలు చేస్తుంటే.. దీనిపై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయాల్సిన జ‌గ‌న్‌.. అలా చేయ‌డం మానేసి.. ఇంకా ఎక్కువ డ‌బ్బుకు ఓట్లును అమ్ముకోవాల‌నే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం స‌మంజ‌సం కాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 


ఎన్నిక‌ల్లో ఓటును నిష్ప‌క్ష‌పాతంగా వేయాల‌ని పిలుపునివ్వాల్సిన నాయ‌కుడుగా జ‌గ‌న్ ఇలా చంద్ర‌బాబు డ‌బ్బులు ఇస్తారు తీసుకుని ఇంకా కావాల‌ని కోరండ‌ని ప్రోత్స‌హించ‌డాన్ని చాలా మంది త‌ప్పు ప‌డుతున్నారు. అదేస‌మ‌యంలో కొన్ని ప్ర‌శ్న‌ల‌ను కూడా సంధిస్తున్నారు. నిజానికి ఎన్నిక‌ల్లో డ‌బ్బుల‌కు అవ‌కాశం లేకుండా ప్ర‌జ‌ల నుంచి ఓట్లు రావాల‌ని, రాలాల‌ని కోరుకుంటుంటే.. జ‌గ‌న్ ఇప్పుడు ఎంపిక చేస్తున్న నాయ‌కుల‌ను, పార్టీలోని సీనియ‌ర్ల‌ను ఏ ప్రాతిప‌దిక‌న టికెట్లు ఇవ్వాల‌ని భావిస్తున్నారో చెప్పాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు.


డ‌బ్బున్న వారికే వైసీపీలో చోటు ఉంటుంద‌ని బ‌య‌ట‌కు వ‌చ్చిన నాయ‌కులు ప‌దే ప‌దే జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిని త‌ప్పుప‌డుతున్న విష‌యాన్ని వారు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో సొంత గూటిని స‌రిచేసుకుని, ఆద‌ర్శంగా ఉండాల్సిన జ‌గ‌న్ ఇలా ప్ర‌జ‌ల‌ను ఓట్ల‌ను అమ్ముకునే వారిగా ప‌రిగ‌ణించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి ఎవ‌రు జ‌వాబు చెబుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: