ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాజులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ సంస్థానాలు చాలానే ఉన్నాయి. కొన్ని శతాబ్దాల క్రితం జనాలను పాలించిన రాజులంటే ఇప్పటికీ జనం గౌరవిస్తారు. ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసి మరీ వారిని ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుంటున్నారు. ఇపుడు ఉత్తరాంధ్రాలో రాజకీయ చిత్రం బాగా మారుతోంది.


అందరూ ఒకే చోట :


ఇప్పటికే పూసపాటి రాజులు సైకిలెక్కేసి కొన్ని దశాబ్దాలుగా ఎంపీలు, ఎమ్మెలేలుగా నెగ్గుతున్నారు. అదే వరసలో బొబ్బిలి రాజులు రెండేళ్ళ క్రితం టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. నిజానికి బొబ్బిలి రాజులకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉండేది. ఆ తరువాత వైసీపీలోకి వచ్చిన సుజయ క్రిష్ణ రంగారావు ఆయన సోదరుడు అదను చూసుకుని టీడీపీకి జై అనేసి మంత్రి పదవిని కొట్టేశారు. ఇక కురుపాం రాజులలో  శత్రుచర్ల విజయ రామరాజు గత ఎన్నికలకు ముందే టీడీపీ తీర్ధం పుచ్చుకుని ఎమ్మెల్సీ అయిపోయారు. ఆయన సోదరుడు, వైసీపీలో ఉన్న చంద్రశేఖ‌రరాజు సైతం టీడీపీలో ఈ మధ్యనే చేరారు. ఇక కురుపాం సంస్థానానికి చెందిన దాయాది అయిన వైరిచర్ల వంశస్థుడు వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ సైతం సైకిలెక్కబోతున్నారు. దాంతో రాజులంతా ఒకే గూటికి చేరినట్లైంది.


అరకు నుంచేనా :


ఇక కాంగ్రెస్ పార్టీతో 42 ఏళ్ళ అనుబంధం కలిగిన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఆరు సార్లు ఎంపీగా, ఒక మారు రాజ్యసభ సభునిగా పనిచేశారు. ఆయన రెండు మార్లు కేంద్ర మంత్రిగా కూడా బాద్యతలు నిర్వహించారు. ఆయన ఈ మధ్యనే కాంగ్రెస్ కి రాజీనామ చేస్తూ ఏపీలో ఆ పార్టీ బతికి బట్టకట్టదని తేల్చేశారు. తాజాగా డిల్లీలో  బాబుని కలసిన ఆయన పసుపు శిబిరంలోకి రానున్నారు. అరకు నుంచి ఆయన పోటీ చేస్తారని అంటున్నారు. అక్కడ మంచి పట్టు ఉన్న వైరిచర్ల పార్టీ మారడంతో టీడీపీకి కలసివస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి రాజులందరినీ ఒకే గూటికి రప్పించడంలో టీడీపీ బాగా సక్సెస్ అయిందని అంటున్నారు. 
                                  



మరింత సమాచారం తెలుసుకోండి: