తెలుగుదేశంపార్టీకి ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆమంచి తొందరలో వైసిపిలో చేరబోతున్నట్లు చెప్పారు. లోటస్ పాండ్ నివాసంలో జగన్ తో ఆమంచి తన మద్దతుదారులతో కలిసి దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. అదే విషయాన్ని ఎంఎల్ఏ తర్వాత మీడియాతో కూడా చెప్పారు. ఎంఎల్ఏ పార్టీకి రాజీనామా చేయబోతున్నారన్న విషయం ఎప్పటి నుండో ప్రచారం అవుతున్నదే. కాకపోతే ఈమధ్య ప్రయత్నాలు ఊపందుకుంది. ఆమంచి టిడిపి వదిలేయబోతున్నారన్న సమచారంతోనే చంద్రబాబు రాయబారాలు పంపారు. పార్టీని వీడకుండా ఉండేందుకు సిఎం చాలా ప్రయత్నాలే చేశారు. అయినా సాధ్యం కాలేదు.

 

టిడిపికి భవిష్యత్తు లేదన్న ఏకైక కారణంతోనే ఆమంచి పార్టీకి రాజీనామా చేయటం గమనార్హం. మొన్నటి వరకూ వైసిపి ఎంఎల్ఏలను టిడిపిలోకి చంద్రబాబు లాక్కున్న విషయం చూసిందే. అదే పద్దతిలో ఇపుడు సీన్ రివర్సులో జరుగుతోంది. కాకపోతే వైసిపి ఎంఎల్ఏలను లాక్కున్న చంద్రబాబు అందులో నలుగురికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టారు. అదే జగన్ మాత్రం ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేస్తేనే వైసిపిలోకి చేర్చుకుంటున్నారు. ఈ ఒక్క విషయంలోనే చంద్రబాబు-జగన్ మధ్య తేడా తెలిసిపోతోంది.

 

ఇక పార్టీకి రాజీనామా చేసిన ఆమంచి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు మాటలు వింటుంటే పిచ్చెక్కినట్లు అనుమానంగా ఉందన్నారు. 70 ఏళ్ళ వయసులో చంద్రబాబుకు అల్జీమర్స్ కూడా సోకిందని చెప్పారు. సరే పార్టీని వదిలేశారు కాబట్టి చంద్రబాబును ఎన్నైనా తిట్టొచ్చులేండి అది వేరే సంగతి. అంటే ఇంతకాలం చంద్రబాబు ఏం చేశారో అదే ఇపుడు రివర్స్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను చీరాల నుండి వైసిపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నట్లు కూడా చెప్పేశారు. అంతా బాగానే ఉందికానీ ఏపి ప్రభుత్వాన్ని అతీత శక్తులు నడిపిస్తున్నాయని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఆ అతీతశక్తులేవో కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: