రాజకీయ ఏరువాక వచ్చేసింది. పదవుల పంట పండించుకోవడానికి నేతాశ్రీలు రెడీ అయిపోతున్నారు. అధికారం ఫలసాయం కోసం రాజకీయ పార్టీలు కూడా దుక్కి దున్నే పనులో పడ్డాయి. మొత్తానికి చూస్తూంటే ప్రక్రుతి లాంటి ఓటరు కరుణ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆశతో మాత్రం వ్యూహాలకు రూపకల్పన చేసుకుంటున్నారు. 


ఉత్తరాంధ్రాకు కుదుపు :


ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలో కీలక‌ నేతగా ఉన్న అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు టీడీపీని వీడనున్నారన్న ప్రచారం ఇపుడు ఆ పార్టీని కలవరపెడుతోంది. ఇప్పటికి రెండు మార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన ముత్తంశెట్టికి అజేయుడు అన్న పేరు ఉంది. బలమైన సామాజికవర్గం అండతో పాటు, అర్ధబలం కూడా బాగా ఉన్న ముత్తంశెట్టి మంచితనం వల్ల కూడా వ్యక్తిగతంగా ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆయన‌ వైసీపీలోకి వెళ్ళి భీమీలీ నుంచి పోటీ చేస్తారని టాక్ నడుతోంది.


ఆయన కూడానా :


ఇక ఉత్తరాంధ్రలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారుతారని మరో వైపు జోరుగా  ప్రచారం నడుస్తోంది. ఆయనకు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల మద్దతు ఉంది. గంటా వారందరితో కలసి ఒకేసారి పార్టీ మారుతారని అంటున్నారు. అయితే తన వర్గానికి పెద్ద పీట వేసి టికెట్లు ఇస్తారని హామీ ఇచ్చినపుడే తాను పార్టీ మారుతానని గంటా అంటున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి గంటా వర్గంలో ముత్తంశెట్టి కూడా ఉన్నారు. మరి అదే కనుక జరిగితే ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీకి పెద్ద దెబ్బ పడిపోతుంది. 


ఇప్పటికే ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్  వైసీపీ గూటికి చేరారు. అదే వరసలో గోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులు సై అంటున్నారని భోగట్టా. ఇలా మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు తట్టా బుట్టా సర్దుకుంటున్నారని  తెలుస్తోంది. అదే జరిగితే పసుపు శిబిరంలో తుపాన్ రేగినట్లే.



మరింత సమాచారం తెలుసుకోండి: