తెలుగుదేశంపార్టీలోని చంద్రబాబునాయుడుకు షాకుల మీద ఫాకులు తగులుతున్నాయి. ప్రజా ప్రతినిధులు ఒక్కోక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి ఎపి అవంతి శ్రీనివాస్ టిడిపికి రాజీనామా చేయనున్నారన్న సమాచారం పార్టీలో సంచలనంగా మారింది. లోటస్ పాండ్ లోని నివాసంలో జగన్మోహన్ రెడ్డితో అవంతి భేటీ అవ్వబోతున్నారట. అవంతి వైసిపిలో చేర్చుకునే విషయంలో జగన్ గ్రీన్ సిగ్నల్ రావటంతోనే భేటీ జరుగుతోందని పార్టీ వర్గాలు చెప్పాయి.

 

వీరిద్దరి మధ్య భేటీ జరిగితే అవంతితో పాటు ఇంకా కొందరు ఎంఎల్ఏలు కూడా టిడిపికి రాజీనామా యోచనలో ఉన్నట్లు సమాచారం. నిజంగా అదే జరిగితే చంద్రబాబుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అవంతి వైసిపిలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఆ ప్రచారమే ఇఫుడు నిజమవుతోందేమో ? జిల్లాలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే విషయంలో మంత్రి గంటా శ్రీనివాసరావుతో తలెత్తిన విభేదాలే పార్టీ మారీ యోచనకు నాందిగా చెప్పాలి.

 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవంతి భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, ప్రస్తుతం ఈ సీటులో మంత్రి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి భీమిలీ నుండి రాబోయే ఎన్నికల్లో కూడా తానే పోటీ చేస్తానంటూ చెబుతున్నారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. చివరకు ఈ వివాదం చంద్రబాబు దగ్గరకు చేరినా పంచాయితీ కుదరలేదు. అదే సమయంలో జిల్లా టిడిపిలోని మెజారిటీ నేతలు గంటా, అవంతి గ్రూపులుగా విడిపోయారు. దాంతో విభేదాలు పెరిగిపోయి రోడ్డున పడ్డాయి.

 

ఇటువంటి నేపధ్యంలో గంటా వర్గంతో పొసగదని అవంతి గ్రూపుకు అర్ధమైపోయింది. దానికితోడు ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపధ్యంలో అవంతి గ్రూపు టిడిపికి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చిందని సమాచారం. దాంతో జగన్ తో అవంతి భేటీకి మార్గం సుగమమైంది. భేటీ జరిగితే అవంతితో పాటు టిడిపికి రాజీనామా చేసే ప్రజా ప్రతినిధులెవరూ అన్న విషయంలో క్లారిటీ వస్తుంది. మొత్తంమీద టిడిపిలో సంచలనాలు నమోదవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: