మారుతున్న రాజకీయ పరిణామాల్లో చీరాల నియోజకవర్గంపై సీనియర్ నేత కరణం బలరామ్ కన్ను పడింది. చంద్రబాబునాయుడు అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికల్లో చీరాల ఎంఎల్ఏగా పోటీ చేయటానికి తాను రెడీ అంటూ బహిరంగంగా ప్రకటించారు. దాంతోనే కరణం కన్ను చీరాలపై పడిందని అర్ధమైపోతోంది.  పోయిన ఎన్నికల్లో నవోదయ పార్టీ తరపున గెలిచి తర్వాత టిడిపిలోకి మారిన ఆమంచి కృష్ణమోహన్ వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. అదే సమయంలో టిడిపికి రాజీనామా చేశారు. దాంతో టిడిపి ఇపుడు కొత్త అభ్యర్దిని వెతుక్కోవాల్సొచ్చింది.

 

అందుకే మిగితా వాళ్ళకన్నా ముందుగా కరణం అలర్టయ్యారు. మొన్నటి వరకూ అద్దంకి నియోజకవర్గంపైనే దృష్టి పెట్టిన కరణం తాజాగా చీరాలపైన కూడా కన్నేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. నిజానికి అద్దంకిలో కరణంకు టికెటు సాధ్యంకాదన్న విషయం అందిరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో కరణంపై  గెలిచిన వైసిపి ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. అప్పటి నుండి కరణం మాట నియోజకవర్గంలో ఎక్కడా చెల్లుబాటు కావటం లేదు. అందుకనే కరణం కూడా ఏదో ఒకరోజు టిడిపి నుండి బయటకు వచ్చేస్తారని ప్రచారం జరుగుతోంది.

 

ఈ నేపధ్యంలో ఊహించని విధంగా ఆమంచి పార్టీకి రాజీనామా చేశారు. ఎటూ అద్దంకిలో టికెటు రాదు కాబట్టి కనీసం చీరాలలో అయినా వస్తే చాలని అనుకున్నట్లున్నారు. అందుకనే చంద్రబాబుకు మద్దతుగా కరణం గొంతిప్పారు. పార్టీకి రాజీనామా చేసిన సమయంలో చంద్రబాబుపై ఆమంచి డ్యామేజింగా కామెంట్లు చేశారు. ఆ విషయంలో ఆమంచిని తప్పుపడుతు చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కరణం గొంతిప్పితే చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉంటోంది. అలాంటిది ఒక్కసారిగా చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారంటేనే చీరాలపై కరణం ఆశలు పెట్టుకున్నట్లే ఉన్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: