అనంత‌పురం జిల్లా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు వామ‌ప‌క్ష ఉద్య‌మాల‌కు పెట్టింది పేరు.  ఆ త‌ర్వాత కాలంలో ఇక్క‌డ టీడీపీ పాగా వేసింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లింలు ఎక్కువ‌గా ఉంటారు. వారి త‌ర్వాత రెడ్లు, మూడో స్థానంలో బీసీలు ఉన్నారు.  2009 ఎన్నికల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన కందికుంట‌ వెంక‌ట‌ప్ర‌సాద్  భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి అత్త‌ర్ చాంద్ భాషాపై స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఆయ‌న ఓడిపోయారు. అయితే త‌ర్వాత కాలంలో చాంద్‌బాషా వైసీపీ నుంచి టీడీపీ గూటికే చేరారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న చాంద్‌భాషా..అటు కందికుంట‌ వెంక‌ట‌ప్ర‌సాద్ సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే చాంద్‌బాషాకు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్ఠానం సిద్ధంగా లేద‌ని తెలుస్తోంది. ఆయ‌న‌పై చేయించిన స‌ర్వేల్లో గెలుపు క‌ష్ట‌మ‌ని తేల‌డంతో చంద్ర‌బాబు కందికుంట‌కే టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. 


ఇక వైసీపీ విష‌యానికి వ‌స్తే క‌దిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్తగా ప‌నిచేస్తున్న పీవీ శిద్దారెడ్డికి పార్టీ అధినేత జ‌గ‌న్ టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేశారంటూ రాయ‌ల‌సీమ  నాలుగు జిల్లాల ఇన్‌చార్జి రాజంపేట తాజా మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం పార్టీ శ్రేణుల‌కు స్ప‌ష్టం చేశారు. అయితే ఇదే స్థానంపై టికెట్ ఆశిస్తున్న వ‌జ్ర భాస్క‌ర్‌రెడ్డి  వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నాడు. తాను స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నిల‌బ‌డ‌తాన‌ని కూడా ఓ సంద‌ర్బంలో వ‌జ్ర‌ భాస్క‌ర్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. నిజంగానే భాస్క‌ర్‌రెడ్డి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగితే వైసీపీ విజ‌య‌వ‌కాశాలను దెబ్బ‌తీస్తుంద‌న్న ఆందోళ‌న ఆ పార్టీ శ్రేణుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. 


వైసీపీ నుంచి శిద్దారెడ్డికి టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయిన నేప‌థ్యంలో ఇక టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేగుతోంది. అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న‌తో దూసుకెళ్లాల‌న్న‌ది వారి ఆలోచ‌న. కందికుంట‌ వెంక‌ట‌ప్ర‌సాద్ అయితే శిద్దారెడ్డికి గ‌ట్టి పోటీ ఇవ్వ‌గ‌ల‌ర‌ని ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. చాంద్‌బాషాపై వ్య‌తిరేక‌త ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న్ను నిల‌బెడితే పార్టీకి ప్ర‌జా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని నేతలు పేర్కొంటున్నారు. ఏ కోణంలో చూసుకున్న శిద్దారెడ్డికి స‌రైన ప్ర‌త్య‌ర్థి వెంక‌ట‌ప్ర‌సాదే అవుతార‌ని పార్టీ వ‌ర్గాలు నొక్కి చెబుతున్నాయి. వెంక‌ట‌ప్ర‌సాద్‌కే టికెట్ ఖ‌రారైతే క‌దిరిలో ఈసారి ర‌స‌వ‌త్త‌ర పోరు ఖాయ‌మ‌ని..రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నాయి. ఇక జ‌న‌సే పోటీకి దిగుతున్నా ఇక్క‌డ ఆ పార్టీకి స‌రైన క్యాండెట్‌, కేడ‌ర్ లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: