ఏపీ ముఖ్యమంత్రి తెలివైన రాజకీయ నాయకుడు. వర్తమాన రాజకీయాల్లో అగ్ర శ్రేణి నేతగా వెలుగొందుతున్నారు. ఆయన కార్యనిర్వహణ దక్షత, వ్యూహాలు, అపర చాణక్యం వంటివి మేటి నాయకునిగా నిలబెట్టాయని చెప్పాల్సిందే. అయితే ఆయన స్వతహాగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి కూడా జీవిత కాలానికి సరిపడా ఓ విమర్శను బాబు  ఎదుర్కొంటూనే ఉన్నారు.


వెన్నుపోటు ఆరోపణలు :


చంద్రబాబు మీద వెన్నుపోటు ముద్ర బలంగా ఉంది. ఆయన 1995 ఆగస్ట్ నెలలో సొంత మామ నందమూరి తారక రామారావు మీద కుటుంబ సభ్యులతో కలసి అధికార మార్పిడి పేరిట వెన్నుపోటు పొడిచారని ఇప్పటికీ నిందిస్తారు.  ఇప్పటికి పాతికేళ్ళు దాటుతున్నా బాబు మీద ఆ మచ్చ పోలేదు సరికదా అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు సైతం బాబును వెన్నుపోటుదారుడంటారు. బాబుని నిందించాలంటే అంతకంటే బలమైన ఆరోపణ వేరొకటి లేదని ఆయన ప్రత్యర్ధులు భావిస్తారు. బాబు సైతం తన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా తిప్పికొట్టగలుతున్నారు కానీ వెన్నుపోటు విమర్శపై మాత్రం ఏమీ అనలేని పరిస్థితి. మొత్తానికి ఆ మచ్చ అలా ఉండగానే లేటెస్ట్ గా బాబు మీద మరో బలమైన ముద్ర పడిపోయింది.


కులతత్వం ముద్ర :


చంద్రబాబు దాదాపుగా తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన మీద కుల ముద్ర లేదు. ఆయన సామాజికవర్గం ఇంతలా దగ్గరైంది లేదు, బాబు సైతం రానిచ్చేవారు కాదంటారు. కానీ 13  జిల్లాల ఏపీకి సీఎం అయ్యాక మాత్రం బాబులో అది బాగా కనబడుతోందని అంటారు. ఆయన ఏరి కోరి అమరావతి రాజధాన్ని ఎంపిక చేయడం వెనక కూడా బలమైన సొంత సామాజికవర్గం వత్తిడి ఉందని చెబుతారు. అత్యంత వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి చెందిన బాబు నవ్యాంధ్రకు తొలిసారిగా సీఎం గా వచ్చిన అవకాశాన్ని మలచుకుని తాను పుట్టిన గడ్డకు రాజధానిని రప్పించలేకపోయారని అంటారు. శ్రీ భాగ్ ఒప్పందాన్ని గౌరవించినా, బాబు తన ప్రాంతం పైన మక్కువ చూపించిన అది ఏమంత కష్టం కాదు.  కానీ బాబు మాత్రం తన సామాజికవర్గం ప్రయోజనాలే చూసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.


ఆ ఉచ్చులో చిక్కారా :


ఏపీలో ఒక సామాజిక వర్గం పెత్తనం ఉందని ప్రచారం అయితే ఉంది కానీ అది మరీ ఇంత బహిరంగమవుతుందని ఎవరూ అనుకోలేదు. ఇక రాజకీయ నాయకులు సైతం ఓపెన్ గా కుల విమర్శలు చేసుకుంటారని ఎవరూ వూహించలేకపోయారు. ఈ మధ్యన ప్రతిపక్ష నాయకుడు జగన్ డిల్లీలో మాట్లాడుతూ బాబు తన సొంత సామాజిక వర్గానికి పోలీస్ శాఖలో ఏకంగా మొత్తానికి మొత్తం పోస్టులలో  పదోన్నతులు కల్పించారని ఘాటైన ఆరోపణలు చేశారు. అది అలా పచ్చిగా ఉండగానే బాబు డిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో బాబు పక్కన ఉన్న వారు సైతం ఆయన సామాజిక వర్గీయులే కావడం విశేషం.


 ఉద్యోగుల సంఘం నేత పరుచూరి అశోక్ బాబు, ఏపీ మెధావుల సంఘం నేత చలసాని  శ్రీనివాస్, సినీ నటుడు శొంఠినేని శివాజీ బాబుతోనే ఉన్నారు. మరి బాబు కుల ముద్ర అలా బయటపడిపోయిందనుకుంటూండంగానే ఆ పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ బాబుకు కులపిచ్చి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన దీనికి సంబంధించి మరికొన్ని ఆరోపణలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులను కూడా కులం ఆధారంగా ఎంచుకుని బాబు నియమించుకున్నారని ఆమంచి చేసిన ఆరోపణలు మాత్రం బాబుపైన కుల ముద్రను బలంగా వేసేసేవే. దీని మీద బాబు అంతరాత్మను ప్రశ్నించుకోవాలంటూ ఆమంచి సవాల్ చేస్తూ మాట్లాడంతో బాబు మీద బురద పడిపోయినట్లైంది


తనకు అన్ని కులాలు సమానమేనని నిత్యం చెప్పే బాబు కీలక నియామకాలు ఎలా చేశారు. ఆయన హయాంలో పద్మశ్రీ వంటి పౌర పురస్కారాలకు సిఫార్సులు   ఏ సామాజిక వర్గం నుంచి ఎక్కువగా వెళ్లాయి నామినేటెడ్ పోస్టుల్లో  తన కులానికి అధిక ప్రాధానత ఇవ్వడం వంటి వాటిపై వచ్చిన ఆరోపణలు మాత్రం బాబు కుల ముద్రను చెరిపేసుకోలేనివేనని చెప్పకతప్పవేమో. మొత్తానికి ఎన్నికలు దగ్గరలో ఉన్న వేళ బాబు మీద ఈ  కుల ముద్ర పడడం ఆయనతో పాటు పార్టీకి కూడా ఇబ్బందికరమే. ఏపీలో కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్న కమ్మ కులానికే పరిమితమై  బాబు పనిచేస్తున్నారన్న ఆమంచి వంటి వారి ఆరోపణలు జనంలో బలంగా వెళ్తే మాత్రం మిగతా 96 శాతం జనాభా రియాక్షన్ ఎలా ఉంటుందో, దాని వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో టీడీపీ పెద్దలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: