ఏపీలో ఎన్నికల సమరం భీకరంగా జరగబోతోంది. ఈసారి ఎన్నికలు అలా ఇలా ఉండవు, చావో రేవో తేల్చేసేవేనని అంటున్నారు. అటు అధికార టీడీపీకి ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. మరో మారు అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉంది. ఇక వైసీపీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా చెప్పాలి. ఓ విధంగా ఆ పార్టీ అంచున ఉండి పోరాటం చేస్తోంది. గెలుపు పిలుపు చాలా అవసరం ఆ పార్టీకి.


కాపులు ఎటో :


ఇక ఏపీలో కులాల అధిపత్యం సంగతి తెలిసిందే. ఏపీలో బలమైన కులాలు చాలా ఉన్నాయి. అందులో కాపులు అతి ముఖ్య పాత్ర పోషిస్తారు. ఏపీలో దాదాపు ప‌దిహేను నుంచి ఇరవై శాతం ఉన్న కాపులు ఏ పార్టీకి జై కొడితే ఆ పార్టీదే అధికారం అన్నది నిజం. గత ఎన్నికల్లో కాపుల మద్దతు లేకనే వైసీపీ ఓడిపోయింది. టీడీపీ గోదావరి జిల్లాలో స్వింగ్ చేసి ఘన విజయం దక్కించుకుంది. మరో మారు కాపుల మద్దతు కోసం టీడీపీ గట్టిగా ట్రై చేస్తోంది కానీ అది ఎంతవరకూ  వర్కౌట్ అయిందీ తెలియదు. కాపులను బీసీల్లో చేర్పిస్తామని చెప్పి పిల్లి మొగ్గలు ఎన్నో టీడీపీ వేసింది. దాని ఫలితమే కాపులు టీడీపీ మీద విముఖంగా ఉన్నారని అంటున్నారు. మరో వైపు కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ జనసేన కూడా బరిలో ఉండడంతో కాపుల రూట్ ఏంటన్నది ఏపీలో నిన్నటి వరకూ తల పండిన రాజకీయ జీవులకు కూడా పెద్ద డౌట్.


వైసీపీ వైపేనా :


గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే కాపులు మెల్లగా వైసీపీ వైపుగా సాగుతున్నారని అర్ధమవుతోంది. బలమైన కాపు నేత, చీరాల ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ జెండా పట్టుకున్నారు. ఇక, ఆయన పార్టీ మారుతూనే టీడీపీపై కమ్మ పార్టీ ముద్ర వేశారు. ఆయన కాపుల్లో ఓ ఫాలోయింగ్  ఉన్న నేత. పైగా ఆయన ప్రభావం ఒక జిల్లాతో ఆగేది కాదు. దాంతో కాపుల మనసులో మాట ఆమంచి నోట వచ్చిందనుకోవాలి. ఏపీలో టీడీపీ పోవాలంటే వైసీపీయే శరణ్యం అని, జగనే బెస్ట్ చాయిస్ అని ఆమంచి నొక్కి చెప్పడం కూడా కాపుల మనోభావాలుగానే చూడాల్సి ఉంటుంది.


ఆ ఎంపీ కూడా :


అదే విధంగా నిన్నటికి నిన్న మరో ఎంపీ అవంతి శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఆయన సైతం బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఇదే వరసలో మరిన్ని కాపు ఎమ్మెల్యేల పేర్లు  కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే ఏపీలో కాపులు ఈసారి తమ రూట్ ఏంటన్నది మెల్లగా చెబుతున్నారనుకోవాలి. ఈ పరిణామంతో గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర మీద కూడా పెను ప్రభావం చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే కాపుల వల్ల ఈసారి దెబ్బ తినబోయేది కచ్చితంగా టీడీపీనే అని చెప్పాల్సి ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: