కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి టీడీపీ ఎంట్రీ వార్తలతో కర్నూలు టీడీపీలో ఎవరికి షాక్‌ తగులుతుందో ?తెలియక జిల్లా టీడీపీలో పలువురు సిట్టింగ్‌ల‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సూర్యప్రకాష్‌ రెడ్డి ఇప్పటికే తన భార్య మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతో పాటు కుమారుడు రాఘవేంద్రరెడ్డితో కలిసి అమరావతిలో చంద్రబాబును కలిసి వచ్చారు. ఆ తర్వాత కోట్ల టీడీపీలో చేరడం లాంఛ‌నమే అన్న ప్రచారం జరుగుతోంది. కోట్ల టీడీపీ ఎంట్రీపై క్లారిటీ వచ్చినా ఆయనకు చంద్రబాబు జిల్లాల్లో ఏ ఏ సీట్లు ఇస్తారు ? కర్నూలు ఎంపీ సీటు ఇస్తారా ? లేదా కోట్ల పట్టుబడుతున్న డోన్‌ అసెంబ్లీ ఇస్తారా, అసల కోట్ల ఫ్యామిలీకి బాబు నుంచి ఏ సీట్లపై హామీ వచ్చిందన్నది బయటకు రాలేదు. కోట్ల ఎంట్రీతో నిన్నటి వరకు కేఈ సోదరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తు వస్తుండగా ఆయన ఇక తన ఎంపీ సీటు ఎక్కడ తన్నుకుపోతారో అని కర్నూలు సిట్టింగ్‌ ఎంపీ బుట్టా రేణుక సైతం అసహనంతోనే ఉన్నారు. 


ఇక తాజాగా ఇప్పుడు కర్నూలు ఎమ్మెల్యే ఎస్సీ మోహన్‌ రెడ్డి సీటుకు సైతం కోట్ల ఎర్త్‌ పెడతారా ? అన్న చర్చలు జిల్లాల్లో జోరుగా జరుగుతున్నాయి. ఇక కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు ఓ అసెంబ్లీ సీటు ఇవ్వాలన్న చర్చలు కోట్ల, చంద్రబాబు వద్ద జరిగినట్టు బయటకు పొక్కింది. అదే జరిగితే కోట్ల ఫ్యామిలీ కర్నూలు ఎంపీ సీటుతో పాటు డోన్‌ అసెంబ్లీ సీటుపై గట్టిగా పట్టుపడుతోంది. 2004లో కోట్ల సుజాతమ్మ డోన్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. ఈ క్రమంలోనే ఎంపీ సీటుతో పాటు డోన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు ఇవ్వాల్సిందే అని కోట్ల ఫ్యామిలీ పట్టు పడుతోంది. అయితే కోట్ల ఫ్యామిలీతో సుధీర్ఘ‌మైన రాజకీయ వైరం ఉన్న కేఈ ఫ్యామిలీ డోన్‌ విషయంలో మాత్రం డోన్‌ను తాము వదులుకునే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొడుతోంది. అదే టైమ్‌లో కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో గందరగోళాన్ని తొలగించేందుకు కేఈ బ్రదర్స్‌ అదిరిపోయే స్కెచ్‌ వేసినట్టు తెలుస్తోంది. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎస్‌.వీ మోహన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ. వెంకటేష్‌ తనయుడు భరత్ మధ్య‌ పోటీ ఉన్న సంగతి తెలిసిందే. 


ఈ నేపథ్యంలో కోట్లకు, కేఈకి మధ్య‌ ఉన్న గ్యాప్‌ నేపథ్యంలో కొద్ది రోజులుగా కేఈ బ్రదర్స్‌ కర్నూల్లో టీజీ. వెంకటేష్‌ను కాకుండా ఎస్‌వీ. మోహన్‌ రెడ్డిని  సపోర్ట్‌ చేస్తు వస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో ఎస్‌వీ. మోహన్‌ రెడ్డి ఫ్యామిలీకి బలమైన అనుచర గణం ఉంది. గతంలో అక్కడ నుంచి ఎస్‌వీ. మోహన్‌ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి టీడీపీ తరపున వరస విజయాలు సాధించారు. ఈ క్రమంలోనే ఆ నియోజకవర్గంలో ఉన్న బంధుగణం ద్వారా తమకు సపోర్ట్‌ చేస్తారిని కేఈ బ్రదర్స్‌ భావించారు. అందుకే కర్నూల్లో ఎస్‌వీ. మోహన్‌ రెడ్డికి కేఈ వర్గం సపోర్ట్‌ చేస్తు వచ్చింది. అయితే అనూహ్యంగా ఎస్‌వీ. మోహన్‌ రెడ్డి కోట్ల ఫ్యామిలీ టీడీపీ ఎంట్రీని స్వాగతించడంతో కేఈ బ్రదర్స్‌కు అదిరిపోయే షాక్‌ తగిలినట్లు అయ్యింది. ఈ క్రమంలోనే అటు టీజీకి ఇటు ఎస్‌వీకి ఒకే సారి చెక్‌ పెట్టడంతో పాటు తమ డోన్‌ సీటుకు పోటీ వస్తారన్న నేపథ్యంలో కోట్లను తప్పించే క్రమంలో కోట్లకు కర్నూలు ఎంపీ సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన తెర మీదకు తెస్తున్నారు. 


కోట్ల కుటుంబం కర్నూలు ఎంపీ సీటుతో పాటు ఆలూరు, డోన్‌ టిక్కెట్లు తమకే వస్తాయని ప్రచారం చేసుకుంటుండడం కోట్ల వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఒకే దెబ్బకు మూడు పిట్లు అన్న చందంగా కర్నూల్లో అటు టీజీ వెంకటేష్‌కు, ఎస్‌వీ. మోహన్‌ రెడ్డికి చెక్‌ పెట్టడంతో పాటు ఇటు కోట్ల సుజాతమ్మను కర్నూలుకు పంపిస్తే తమకు ఏ ఇబ్బంది ఉండదన్న ప్లాన్‌ కేఈ వర్గం వేసింది. కర్నూలు మైనార్టీల్లో కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డికి ఇప్పటికి పట్టుంది. అలాగే ఆయన గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కర్నూలు నియోజకవర్గం నుంచి ఆయనకు భారీగా ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కలనే ఉదాహరణలుగా చూపుతున్న కేఈ వర్గం కర్నూలు నుంచి కోట్ల సుజాతమ్మను బరిలోకి దింపాలన్న ప్రతిపాదన తెస్తోంది. ఏదేమైన కోట్ల టీడీపీఎంట్రీ కర్నూల్లో రెండు మూడు నియోజకవర్గాలతో పాటు రెండు మూడు కుటుంబాల్లో చిచ్చుకు కారణం అవుతుంది. మరి ఈ ఎన్నికల వేళ‌ ఎలా చల్లారుతుందో చూడాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: