మొత్తానికి కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం తెలుగుదేశంపార్టీలో చేరటం ఖాయమైంది. కేంద్ర మాజీమంత్రి కోట్ల  సూర్యప్రకాష్ రెడ్డి కొడుకు కోట్ల  రాఘవేంద్రరెడ్డి ఈ విషయాన్ని క్లారిఫై చేశారు. మీడియాతో మాట్లాడుతూ, తొందరలో తమ కుటుంబం టిడిపిలో చేరబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. చంద్రబాబునాయుడుతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులు భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే భేటీ జరిగి చాలా రోజులే అయినా ఇటు కోట్ల కానీ అటు టిడిపి కానీ చేరికలపై నోరెత్తలేదు. ఎందుకంటే, రాబోయే ఎన్నికల్లో కర్నూలు ఎంపితో పాటు డోన్, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కోట్ల అడిగారట.

 

కర్నూలు ఎంపిగా తానకు, డోన్ లో తన భార్య సుజాతమ్మకు, ఆలూరులో కొడుకు రాఘవేంద్రకు టిక్కెట్లు ఇవ్వాలని కోట్ల డిమాండ్ చేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. కర్నూలు ఎంపి, ఆలూరు అసెంబ్లీ వరకూ ఒకేనే కానీ డోన్ దగ్గరే చంద్రబాబుకు సమస్య వచ్చింది. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో డోన్ లో కెఇ ప్రభాకర్ పోటీచేసి ఓడిపోయారు. మళ్ళీ రాబోయే ఎన్నికలకు పోటీ  చేయటానికి రెడీ అయిపోతున్నారు. ప్రభాకర్ అంటే ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తికి స్వయానా సోదరుడన్న విషయం అందరికీ తెలిసిందే.

 

జిల్లాలో కోట్ల వర్గానికెంత పట్టుంది కెఇ కుటుంబానికి కూడా అంతే పట్టుంది. పైగా డోన్ నియోజకవర్గంలో దశాబ్దాల పాటు కెఇ కుటుంబమే పోటీ చేస్తోంది. తాము టిడిపిలో చేరాలంటే డోన్ సీటును తమ కుటుంబానికి కేటాయించాలని కోట్ల డిమాండ్ చేశారు. ఎందుకంటే, కోట్ల కుటుంబం లేదా వర్గగం కూడా చాలా సంవత్సరాలుగా డోన్ లోనే పోటీ చేస్తోంది. కాకపోతే మొన్నటి వరకూ కోట్ల, కెఇ కుటుంబాలు శతృపక్షాలుగా ఉండటంతో ఎవరికీ ఇబ్బంది కలగలేదు. కానీ ఇపుడు కోట్ల కుటుంబం కూడా టిడిపిలోనే చేరుతుండటంతోనే చంద్రబాబుకు తలనొప్పులు మొదలయ్యాయి.

 

విషయం ఏమిటంటే రెండు కుటుంబాలు కూడా డోన్ సీటుపైనే పట్టు పట్టడంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోయారు. అందుకే టిడిపిలో చేరనున్నట్లు తానెపుడు చెప్పలేదే అంటూ కోట్ల అడ్డం తిరిగారు. దాంతో కోట్ల కుటుంబం టిడిపిలో చేరికపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో రాఘవేంద్రరెడ్డి చేసిన తాజా ప్రకటనతో అనుమానాలు పటాపంచలైపోయాయి. పైగా తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని కూడా రాఘవేంద్ర స్పష్టం చేశారు. మరి డోన్ సీటు విషయం ఏమైందో మాత్రం చెప్పలేదు. కాకపోతే రాఘవేంద్ర తాజా ప్రకటనతో కోట్ల కుటుంబం డోన్ ను వదిలేసి ఆలూరుతో సరిపెట్టుకుంటుందనేది అర్ధమవుతోంది. ఏమైనా అధికారిక ప్రకటన రావాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: