తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టు బోర్టు సభ్యునిగా సండ్ర వెంకటవీరయ్య సభ్యత్వం రద్దయింది. బహుశా టిటిడి చరిత్రలోనే బోర్డు సభ్యునిగా నియమించిన తర్వాత ఆ సభ్యత్వం రద్దవటం ఇదే మొదటిసారేమో ? మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర వెంకటవీరయ్య తెలుగుదేశంపార్టీ అభ్యర్దిగా గెలిచారు. తెలంగాణాలో టిడిపికున్న ఇద్దరు ఎంఎల్ఏల్లో సండ్ర ఒకరు. ఎటూ ఏపిలో టిడిపినే అధికారంలో ఉంది కాబట్టి సండ్రను వెంటనే చంద్రబాబునాయుడు బోర్డు సభ్యునిగా నియమించారు.

 

నిజానికి సండ్ర సభ్యత్వానికి వచ్చిన లోటేమీ లేదు. మొన్నటి ఎన్నికలకు ముందు కూడా పాలకవర్గంలో సభ్యునిగానే ఉన్నారు. అయితే, ఎన్నికల సమయంలో లాభదాయక పదవుల విషయంలో టిఆర్ఎస్ లొల్లి పెడుతుంటే ముందుజాగ్రత్తగానే సండ్ర రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా మళ్ళీ టిటిడి బోర్డులో సభ్యత్వం ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వటంతోనే సండ్ర రాజీనామా చేశారు.

 

ముందుగా అనుకున్నట్లుగానే ఎన్నికల్లో గెలవగానే సండ్రను ఏపి ప్రభుత్వం మళ్ళీ బోర్డు సభ్యునిగా నియమించింది. అయితే, నియామకం అయిన నెల రోజులకు కూడా సండ్ర బోర్డు సభ్యునిగా ప్రమాణం చేయకపోవటంతో ఈరోజు ప్రభుత్వం సండ్ర సభ్యత్వాన్ని రద్దు చేసింది. సభ్యునిగా నియామకం అయిన తర్వాత కూడా సండ్ర ఎందుకు బాధ్యతలు తీసుకోలేదు ? ఎందుకంటే, గెలిచిన దగ్గర నుండి టిఆర్ఎస్ లోకి సండ్రను లాక్కోవాలని కెసియార్ అండ్ కో బాగా గోకుతున్నారు.

 

 ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కెటియార్ టిఆర్ఎస్ లోకి రావాల్సిందిగా సండ్రను బాగా ఒత్తిడి పెడుతున్నారు. దాంతో సండ్ర కూడా వాళ్ళ ఒత్తిడికి లొంగారు. సండ్రకు మంత్రిపదవి ఇస్తానని కెసియార్ స్వయంగా హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే, మంత్రివర్గాన్ని కెసియార్ ఏర్పాటు చేయలేదు. ఈ నెల 19వ తేదీన మంత్రివర్గం ఏర్పాటు ఉంటుందని అంటున్నారు. మరి మంత్రివర్గంలో సండ్రకు చోటుండేదీ లేంది తెలీదు. ఆ ఊగిసలాటలోనే సండ్ర టిటిడి బోర్డు సభ్యునిగా ప్రమాణం చేయలేదు. నాలుగు రోజుల్లో ఏ సంగతి తేలిపోతుంది కదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: