ఇప్పుడు ఏపీ రాజకీయం రంజుగా సాగుతోంది. టీడీపీ నుంచి వరుస వలసలతో ప్రతిపక్ష వైసీపీ బలంగా కనిపిస్తోంది. ఇంకా ఈ వలసలు జోరందుకుంటాయన్న వాదన వినిపిస్తోంది. 20 మంది.. 30 మంది.. వైసీపీలోకి వచ్చేస్తున్నారని ప్రచారాలు జోరందుకున్నాయి.



ఈ నేపథ్యంలో జగన్ రాంగ్ స్టెప్ వేస్తున్నారా.. పాలిటిక్స్ మాంచి వేడిగా ఉన్నసమయంలో ఆయన నిర్ణయం వైసీపీకి హాని చేస్తుందా.. ఇంతకీ ఏమిటీ నిర్ణయం అంటారా.. అదే ఫారిన్ టూర్.. లండన్ లో విద్యనభ్యసిస్తున్న తన కూతురును చూసి వచ్చేందుకు నాంపల్లి కోర్టు ఆయనకు పర్మిషన్ ఇచ్చింది.



సరిగ్గా ఎన్నికలకు ముందు అది కూడా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు జగన్ విదేశీ పర్యటనకు వెళుతుండటం ఇప్పుడు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. త్వరలోనే మరింత మంది టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఈ లెక్కన ఈ రెండు నెలలు వైసీపీకి చాలా ముఖ్యమైనదని చెప్పక తప్పదు. ఇలాంటి తరుణంలో ఓ వారం పాటు జగన్ విదేశీ పర్యటనకు సిద్ధమైపోవడం నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది.



అయితే ఈ టూర్ వెనుక కూతుర్ని పలకరించి రావడంతో పాటుగా చాలా పెద్ద పనినే జగన్ పెట్టుకున్నారన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ఎన్నికల కోసం ఎన్నారైల నుంచి నిధులు సమీకరించుకునేందుకే జగన్ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసినట్టు కొందరు అంటున్నారు. ఎన్నికల వేళ అవసరమయ్యే నిధులను సర్దుకోవడానికి జగన్ ఈ టూర్ ప్లాన్ చేశారని వాదన వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: