రాజ‌కీయ యోధుడు, సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఆరితేరిన నాయ‌కుడు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు అంటే తెలియ‌నివారు దాదాపు ఎవ‌రూ ఉండ‌రు. అయితే, ఆయ‌న‌కు, ఆయ‌న కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణ‌కు వ్య‌తిరేకంగా ఇప్పుడు గుంటూ రులో భారీ ఎత్తున నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు వెల్లువెత్తాయి. దీంతో ఒక్క‌సారిగా కోడెల విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చనీ యాంశంగా మారింది. దివంగ‌త ఎన్టీఆర్ టీడీపీని స్తాపించిన స‌మ‌యంలోనే కోడెల టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా న‌ర స‌రావుపేట నుంచి ప్రాతినిధ్యం వ‌హించి అనేక మార్లు విజ‌యం సాధించారు. మంత్రి ప‌ద‌వులు కూడా అలంక‌రించారు. ఇక‌, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌విని ఆశించారు. 


అయితే,  కొన్ని రాజ‌కీయ కార‌ణాల నేప‌థ్యంలో కోడెల‌ను స్పీక‌ర్‌గానే ఉంచారు బాబు. దీంతో ఈ ఐదేళ్ల కాలంలోనూ కోడెల ఏపీ అసెంబ్లీకి స్పీక‌ర్‌గానే ఉన్నారు. ఇక‌, 2014ఎన్నిక‌ల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో ఆపార్టీకి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను కేటాయించారు. దీంతో న‌ర‌స‌రావు పేట‌ను వ‌ద‌లుకుని స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేశారు కోడెల‌. అక్క‌డ వైసీపీ నాయ‌కుడు అంబ‌టిపై విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలోనే పార్టీలోకి వ‌చ్చిన కోడెల కుమారుడు శివ‌రాం కూడా పార్టీలో క్రియాశీల‌కంగా మారారు. ముఖ్యంగాతండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ‌సూళ్ల‌కు తెర‌దీశార‌ని పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు మిన్నంటాయి. త‌న‌కు సంబంధం లేకున్నా కూడా శిస్తు క‌ట్టాల‌నే రేంజ్‌లో శివ‌రామ‌కృష్ణ వ్య‌వ‌హ‌రించారు. 


ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో ఏం చేయాల‌న్నా ప్ర‌తి ప‌నికీ ఇంతని రేటు నిర్ణ‌యిస్తున్న ప‌రిస్థితి కూడాఇక్క‌డ  తీవ్ర వ్య‌తిరేక‌త కు కార‌ణ‌మైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని చూస్తున్న శివ‌రామ‌కృష్ణ‌, దానికి త‌గిన విధంగా నిధులు స‌మ‌కూర్చు కుంటున్నార‌నే వాద‌న కూడా ప్ర‌బ‌లింది. మొత్తానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో కోడెల ఫ్యామిలీ చేస్తున్న ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట‌ప‌డాల‌ని డిమాండ్ చేస్తూ.. ఏకంగా అఖిల‌ప‌క్షం నాయ‌కులు ఉద్య‌మానికి దిగారు. ఉద‌యం ప‌ది నుంచి స‌త్తెన‌ప‌ల్లిలో ధ‌ర్నాలు, రాస్తారోకోలు నిర్వ‌హించారు. ఒక్క‌సారిగా బాంబు పేలిన‌ట్టు ఇలా జ‌ర‌గ‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ట్ట‌యింది. ఈ ప‌రిణామాల‌తో కోడెల వ‌ర్గం కూడా ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి రాబోయే రోజుల్లో మ‌రింత వ్య‌తిరేకత వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: