షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టిడిపిలో నుండి నేతలు బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ మాజీ ఎంఎల్ఏ ఇరిగెల రాం పుల్లారెడ్డి వైసిపిలో చేరారు. లోటస్ పాండ్ లోని నివాసంలో జగన్మోహన్ రెడ్డితో తన సోదరునితో కలిసి ఇరిగెల భేటీ అయ్యారు. ముందుగా టిడిపికి రాజీనామా చేసిన తర్వాత వారి భేటి జరిగింది. జిల్లాలో ప్రధానంగా ఆళ్ళగడ్డలో జరుగుతున్న పరిణామాలను తట్టుకోలేకే తాను టిడిపికి రాజీనామా చేసినట్లు చెప్పారు.

 

జిల్లాలో భూమా, ఇరిగెల కుటుంబాల మధ్య మొదటి నుండి రాజకీయ వైరం ఉంది. దానికితోడు ఫిరాయింపు ఎంఎల్ఏ  అఖిలప్రియ మంత్రయిన తర్వాత ఇరిగెలపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో ఇరిగెల వర్గానికి ఎటువంటి పనులు జరగకుండా అడ్డుకుంటున్నారట. దాంతో రెండు వర్గాల మధ్య ఎప్పుడూ గొడవలే. ఇదే విషయాలను చంద్రబాబుతో చెప్పినా ఉపయోగం కనబడలేదు. దాంతో ఇరిగెలకు పార్టీ నాయకత్వంపై మండిపోయింది.

 

ఎటూ షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా అందుకే తన దారి తాను చూసుకోవాలని అనుకున్నారు. అందులో భాగంగానే జగన్ తో భేటీ అయి వైసిపి కండువా కప్పేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసిపి విజయానికి కృషి చేస్తానని చెప్పారు. మొదటి నుండి కూడా భూమా కుటుంబంతో వైరం కూడా ఉండటంతో కచ్చితంగా అఖిల ఓటమికి ఇరిగెల తీవ్రంగా కృషి చేస్తారనటంలో సందేహం లేదు. అసలే అఖిలను ఓడగొట్టటానికి పార్టీలోనే ఉన్న సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి, నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి, మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎటూ కాచుకుని కూర్చున్నారు. ఇపుడు వారికి వైసిపిలో చేరిన ఇరిగెల కూడా తోడవుతున్నారు. మరి ఇటువంటి పరిస్ధితుల్లో భూమా గెలుపు సాధ్యమేనా ?


మరింత సమాచారం తెలుసుకోండి: