ఏదైనా పంచాయితీ చేయాలంటూ చేసే వ్యక్తికి ముందు క్రెడిబులిటీ ఉండాలి. తర్వాత ధైర్యముండాలి. వివాదాలు పడుతున్న వ్యక్తులపై అన్నీ విధాలుగా పూర్తిస్ధాయి ఆధిపత్యం ఉండాలి. అప్పుడే వివాదాలు పరిష్కారమవుతాయి. లేకపోతే ఏదో మొక్కుబడిగా వచ్చి తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే పంచాయితీ కంటిన్యూ  చేస్తుంటారు నేతలు.  ఇపుడు తెలుగుదేశంపార్టీలో జరుగుతున్నదదే.  గడచిన నాలుగేళ్ళుగా పంచాయితీలు జరుగుతున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. టీవీ సీరియళ్ళు లాగానో జీడిపాకం లాగానే పంచాయితీలు కూడా సా...గుతూండటంతో చంద్రబాబునాయుడు సామర్ద్యం మీదే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 Image result for chandrababu and kadapa leaders

పంచాయితీలు జరుగుతున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నా మచ్చుకి ఓ నాలుగు మాత్రం తీసుకుందాం. అందులో మొదటిది జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం. దాదాపు నాలుగేళ్ళపాటు ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డికి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి మధ్య పంచాయితీ నడిచింది. రేపటి ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సీటులో ఎవరు పోటీ చేయాలన్నది పంచాయితీ.  

 Image result for chandrababu and kurnool leaders

జమ్మలమడుగులో ఎంఎల్ఏగా నేను పోటీ చేయాలంటే కాదు నేనే పోటీ చేస్తానంటూ ఎవరికివారుగా పట్టుపట్టారు. మొత్తానికి కడప ఎంపిగా ఆదినారాయణరెడ్డిని పోటీకి ఒప్పించారు. అందుకనే ఎంఎల్సీగా రామసుబ్బారెడ్డితో రాజీనామా చేయించారు.  ఖాళీ అయిన ఆ సీటును ఫిరాయింపు మంత్రి కుటుంబానికి కేటాయించబోతున్నారు. ఇంత జరిగినా రేపటి ఎన్నికల్లో ఇద్దరూ సహకరించుకునేది అనుమానమే.

 Image result for chandrababu and anantapur leaders

కర్నూలులోని ఆళ్ళగడ్డ నియోజకవర్గం కథ మరోటి. ఇక్కడ ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ కు వ్యతిరేకంగా చాలామంది నేతలు ఏకమవుతున్నారు. సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి రేపటి ఎన్నికల్లో మంత్రికి టికెట్ కోసం ప్రధాన పోటీదారు. వీళ్ళ రెండు వర్గాలు రాళ్ళతో కూడా దాడులు చేసుకున్నాయి. భూమా కుటుంబానికి వ్యతిరేకంగా చాలామంది నేతలు ఏవికి మద్దతుగా నిలబడ్డారు. అఖిల, ఏవితో చంద్రబాబు ఎన్నిసార్లు సమావేశమైనా పంచాయితీ మాత్రం కుదరలేదు. ఆళ్ళగడ్డ పంచాయితీ ప్రభావం నంద్యాల మీద కూడా పడటం ఖాయం. అనంతపురం జిల్లాలో ఎంపి జేసి దివాకర్ రెడ్డికి దాదాపు ఏడుగురు ఎంఎల్ఏలతో పడటం లేదు. వీళ్ళలో అత్యధికులు రేపటి ఎన్నికల్లో ఓడిపోతున్నారని ఎంపి పదేపదే చెబుతున్నారు. దాంతో వాళ్ళంతా జేసిపై మండిపోతున్నారు. వాళ్ళ మధ్య సమన్వయం కుదర్చటానికి చంద్రబాబు ఎన్ని పంచాయితీలు చేసినా సాధ్యం కాలేదు.

 Image result for chandrababu and uttarandhra leaders

ఇక ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లాలోని మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య పంచాయితీలు చేయాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. వీళ్ళ మధ్య వివాదాలు చాలు పార్టీ పుట్టి ముంచటానికి.  విజయనగరం జిల్లాలో ఫిరాయింపు మంత్రి సుజయ కృష్ణ రంగారావు, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు మధ్య వివాదాలు ఈనాటివి కావు. వివాదాలు తారాస్ధాయికి చేరుకోవటంతో అశోక్ చివరకు పాలిట్ బ్యూరో సమావేశానికే కాదు చంద్రబాబుతో కూడా టచ్ లోకి రావటం లేదు. అశోక్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. వీళ్ళమధ్య పంచాయితీ చేయలేక చివరకు చంద్రబాబు కూడా వదిలేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలే ఉన్నాయి. సంవత్సరాల తరబడి పంచాయితీలు ఎందుకు కంటిన్యూ అవుతున్నాయంటే పంచాయితీలు చేసేంత సీన్ చంద్రబాబుకు లేదు కాబట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: