తెలుగుదేశంపార్టీ కాకినాడ ఎంపి తోట నర్సింహం పోటీ నుండి తప్పుకున్నారు. అనారోగ్య కారణాల వల్లే రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని చంద్రబాబునాయుడుతో భేటీ సందర్భంగా తోట స్పష్టం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబుతో తోట అమరావతిలో దాదాపు గంటకు పైగా సమావేశం అయ్యారు. తనకు ఆరోగ్యం బావోలేదని చంద్రబాబుతో ఎంపి స్పష్టంగా చెప్పారట. అయితే, పోటీ చేయలేనంత అనారోగ్యం ఎంపికి ఏముందో పార్టీ వర్గాలకు అర్ధం కావటం లేదు.

 

రానున్న ఎన్నికల్లో తోట వైసిపి తరపున పోటీ చేయనున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తోట తొందరలోనే టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల బరిలో నుండి తప్పుకోవటంతో నేతల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాను పోటీ చేయనని చెప్పిన తోగ జగ్గంపేట అసెంబ్లీ టికెట్ తన భార్యకు ఇవ్వాలని చంద్రబాబును కోరటం ఆశ్చర్యంగా ఉంది.

 

జగ్గంపేటలో ఫిరాయింపు ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రు ఉన్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏ ఉండగా తన భార్యకు చంద్రబాబు టికెట్ ఇస్తారని తోట ఎలా అనుకున్నారో అర్ధం కావటం లేదు. జగ్గంపేట అసెంబ్లీలో పోటీకి తన భార్యకు చంద్రబాబు అవకాశం ఇవ్వరన్న విషయం తోటకు బాగా తెలుసు. అదే కారణంతో టిడిపికి రాజీనామా చేయాలని తోట అనుకున్నారా ? అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. మరి తోట ఏం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: