పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు  టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో మారు తన నోటికి పని చెప్పారు. అయితే ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో ఆయన దళితులపై ఎలా రెచ్చిపోయిందీ తెలియచేస్తోంది.  దళితులను ఉద్దేశించి ఆయన  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో  ఇపుడు వైరల్ అవుతున్నాయి. దళితులు మీకెందుకు రాజకీయాలు అంటూ చింతమనేని దారుణంగా తిట్ల పురాణం అందుకోవడం పట్ల అపుడే దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నాయి. ఎన్నికల వేళ ఇలా నోరు పారేసుకున్న చింతమనేని ప్రభావం మొత్తం ఇపుడు టీడీపీపైనా పడే అవకాశాళు ఉన్నాయి.


నోటికొచ్చినట్లుగా :


వివరాల్లోకి వెళ్తే,  గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంలో స్థానిక  టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ దళితుడు తాను మాట్లాడతానని మైక్‌ అడగడంతో చింతమనేని ఆగ్రహంతో ఊగిపోయారు. అసభ్య, అభ్యంతరకర పదజాలంతో దళితులపై విరుచుకుపడ్డాడు. ‘మొన్న జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు నేను కావాలంటే అడ్డుకునేవాడిని కదా.. నేను మాట్లాడానా.. అప్పుడు గొడవ పడితే మీరు రారా..’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు వీడు మాట్లాడతానంటూ మైక్‌ అడుగుతున్నాడంటూ చింతమనేని మండిపడ్డారు. 


పదవులు మాకే కావాలి :


‘రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్‌ క్యాస్ట్‌ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకు పదవులు. మీకెందుకురా అంటూ చింతమనేని దళితులను ఇష్టారీతిన దూషించి అవమానించాడు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో చింతమనేని వివక్షపూరిత వ్యాఖ్యలపై దళిత సంఘాలు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తామంటే టీడీపీ నాయకులకు ఇంత చిన్నచూపా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అంత నీచంగా కనిపిస్తున్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


అప్పట్లో బాబు అలా :


ఇక టీడీపీలో చంద్రబాబు సహా అనేకమంది గతంలో దళితులపై దారుణంగా వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ వివక్ష పూరిత వ్యాఖ్యలు చేయడాన్ని దళిత నేతలు  గుర్తు చేస్తున్నారు. .. ఆలాగే  మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం దళితులు శుభ్రంగా ఉండరంటూ అవమానించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో పథకం ప్రకారమే దళితులపై దాడులు జరుగుతున్నాయని, రాజకీయంగా అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని దళిత నాయకులు ఫైర్ అవుతున్నారు. .
 ముందు చింతమనేనని వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. తమను హీనంగా చూస్తున్న టీడీపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: