టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు మ‌రో ఎంపీ రంగం సిద్ధం చేసుకున్నారు. మొద‌ట అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస‌రావు, నిన్న అమ‌లాపురం ఎంపీ  పండుల ర‌వీంద్ర‌బాబు..ఇప్పుడు కాకినాడ ఎంపీ తోట న‌ర్సింహం త‌న‌దారి తాను చూసుకుంటున్నాను. అయితే పోతూ పోతూ ఏదో ఒక కార‌ణం చూపాల‌న్న‌ట్లుగా ఆయ‌న భార్య వాణికి జ‌గ్గంపేట టికెట్ ఇవ్వాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబును క‌ల‌వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే అక్క‌డ జ్యోతుల నెహ్రూను చంద్ర‌బాబు ఖాయం చేశారు. ఇప్పుడు అదే టికెట్‌ను అడిగితే చంద్ర‌బాబు ఎలాగూ ఒప్పుకోడు..క‌నుక పార్టీ త‌న డిమాండ్‌ను ఏమాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే పార్టీ మారాల్సి వ‌చ్చింద‌నే విష‌యాన్నిచెప్పుకుని సానుభూతి పొంద‌వ‌చ్చ‌న్న‌ది ఆయ‌న రాజ‌కీయ వ్యూహంగా తెలుస్తోంది. 

Image result for avanti srinivas

వాస్త‌వానికి ఆయ‌న‌కు ఎంపీగా టికెట్ ఇచ్చేది లేద‌ని స్ప‌ష్ట‌మైన సంక‌తాలు రావ‌డంతో కొద్దిరోజులుగా ఆయ‌న పార్టీ మారుతార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఊగిస‌లాట ధోర‌ణి తో ఉన్నారు. ఇక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం మ‌రీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చివ‌రికి వెళ్లిపోవాల‌నే నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో ఆయ‌న ట‌చ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న త‌న భార్య వాణికి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి వైసీపీ ఆ డిమాండ్‌ను నెర‌వేరుస్తుందా అన్న‌ది కూడా డౌంటే అన్న ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి.  అయితే జగ్గంపేట వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న జ్యోతుల చంటిబాబును తప్పించి వాణికి టిక్కెట్టు ఇస్తారా? అనేదానిపైనా ఉత్కంఠ కొనసాగుతోంది. జ్యోతుల నెహ్రూ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత చంటిబాబు తనకు టిక్కెట్టు రాదని తెలిసి వైసీపీలో చేరారు.


అప్పటికి జగ్గంపేట వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న ముత్యాల శ్రీనివాస్‌ని తప్పించి చంటిబాబుకి పదవి ఇచ్చారు. ఇప్పుడు వాణి పార్టీలో చేరితే చంటిబాబుని తప్పించి ఆమెకి కోఆర్డినేటర్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇదే అనుమానంతో జ్యోతుల చంటిబాబు మంగళవారం వైసీపీ ముఖ్య నాయకులను కలసినట్టు సమాచారం. చాలాకాలం పాటు కాంగ్రెస్‌లో ప‌నిచేసిన తోట న‌ర్సింహం 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఎంపీగా పోటీ చేసి గెలిచారు.  ఇక ఈనెల 28న చలమలశెట్టి సునీల్‌ టీడీపీలో చేరడం ఖాయమైన పక్షంలో తోట నర్సింహం ఈసారి ఎంపీగా పోటీ చేసే పరిస్థితి క‌నిపించ‌డం లేదు. అయితే తన భార్య సీటు కోసం ఆయన సీఎంని కలిశారు. ఆయన డిమాండును బట్టి.. స్పష్టమైన హామీ లభిస్తే పార్టీలో కొనసాగాల‌ని..లేదంటే వైసీపీలో చేరి టిక్కెట్టు తెచ్చుకోవచ్చన్న ఎత్తుగడతో ముందుకెళ్తున్నారు.


ఇక టీడీపీ నేతలు వ‌చ్చి చేరుతుండ‌టంతో వైసీపీలో రాజ‌కీయంగా అంద‌రికీ అక‌మిడేష‌న్ క‌ల్పించ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. బేధాభిప్రాయాలు ఉన్న నేత‌లంద‌రూ ఒకే గూటికి చేరుతుండ‌టం గ‌మ‌నార్హం. వీరి మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొన‌సాగుతుందా అంటే డౌటే అంటూ అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  వైసీపీలో కొత్త నేతల చేరికతో ఇప్పటికే ఆ పార్టీలో ముందు నుంచీ ఉన్న నేతలు ఇబ్బందిపడుతున్నారు. వీరి రాకతో తమ ప్రాధాన్యం కోల్పోతామన్న ఉద్దేశంతో ఉన్న సదరు నేతలు ప్రతి వ్యూహాలు రూపొందించుకునే పనిలోపడ్డారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరడం వల్ల గన్నవరం అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తారని జరుగుతున్న ప్రచారంతో అక్కడ వైసీపీ టిక్కెట్టుపై ఆశలు పెట్టుకున్న నేత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే పండులకు పాయకరావుపేట అసెంబ్లీ సీటు ఇస్తామని చెప్పి ఇక్కడ కేడర్‌ని వైసీపీ నాయకులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నార‌ని స‌మాచారం. టికెట్ల ఖ‌రారు త‌ర్వాత మ‌ళ్లీ చాలా మంది నాయ‌కులు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉంటార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: