బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బుధవారం అర్ధరాత్రి సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 70 మంది సజీవ దహనమయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.  ఓ భవనంలోని కెమికల్ గోదాంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే చుట్టుపక్కల భవనాలకు వ్యాపించాయి. ఢాకాలోని చాక్‌బజార్‌లోని ఓ అపార్టుమెంటులో బుధవారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. అయితే అదే అపార్టుమెంటులో ఓ కెమికల్‌ వేర్‌హౌజ్‌ కూడా ఉండటంతో చుట్టూ ఉన్న భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి.

భద్రతా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పాత భవనం కావడంతో అగ్ని ప్రమాదంలో ఎక్కువ మంది మరణించారు. మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు.  తాము ఇప్పటివరకు 70 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని బంగ్లాదేశ్ అగ్నిమాపక శాఖ సంచాలకులు జుల్ఫికర్ రహమాన్ చెప్పారు.  ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని వెల్లడించారు. మంటల ధాటికి పలువురు ప్రయాణికులు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు.  అంతే కాదు అక్కడ ఓ వివాహానికి సంబంధించిన ఫంక్షన్ కూడా జరుగుతుందని అధికారులు అంటున్నారు.

గతంలో కూడా ఢాకాలో ఇలాంటి ఘెర అగ్ని ప్రమాదం సంభవించింది. 2010లో జరిగిన ఈ ఘటనలో సుమారు 120 మంది మృతి చెందారు.  మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించామని ఆయన వివరించారు. అగ్నిప్రమాదానికి కారణాలేమిటనేది ఇంకా తేలలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: