వినటానికే విచిత్రంగా ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి అందునా రాజధాని జిల్లాల్లో ఒకటైన కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో గట్టి అభ్యర్ధే దొరకటం లేదంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. అదికూడా తెలుగుదేశంపార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీయార్ సొంత నియోజకవర్గం, ఒకసారి ప్రాతినిధ్యం వహించిన చోటే కావటం గమనార్హం. గుడివాడలో పార్టీ తరపున పోటీ చేయటానికి అభ్యర్ధిని వెతుక్కుంటున్నారంటే అందుకు నాయకత్వానిదే తప్పు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, రాబోయే ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి 10 మందిని చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధుల కోసం వెతుకుతున్నారు. అందులో గుడివాడ నియోజకవర్గం చాలా కీలకమైనది. గుడివాడ నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నది వైసిపి ఎంఎల్ఏ కొడాలి నాని. గడచిన మూడు ఎన్నికల్లో నాని వరుసగా గెలుస్తున్నారు. దాంతో టిడిపి ఇక్కడ క్యాడర్ మొత్తం బాగా వీక్ అయిపోయింది.

 

చంద్రబాబు కూడా ఈ నియోజకవర్గంలో నాయకత్వాన్ని బలోపేతం చేయటానికి దృష్టి పెట్టలేదు. ఎలాగంటే ప్రతీ ఎన్నికలోను ఇక్కడి నుండి ఓ నేత పోటీ చేస్తారు. దాంతో నియోజకవర్గాన్ని పటిష్టం చేయటంలో నేతలకు కూడా ఆసక్తి పోయింది. దాంతో కొడాలి నానికి ఎదురే లేకపోయింది. దాని ప్రభావం రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతోంది. నానిని ఎదుర్కోవటానికి బలమైన అభ్యర్ధుల కోసం చంద్రబాబు ఎంత వెతికినా ఎవరూ కనబడటం లేదు. పోయినసారి ఎన్నికల్లో ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావు విషయంలో చంద్రబాబు ఇంట్రస్ట్ గా లేరు.

 

అందుకని దేవినేని అవినాష్ పేరు పరిశీలిస్తున్నారు. దేవినేనేమో ఎన్నికలకే కాకుండా నియెజకవర్గానికి కూడా కొత్తే. అవినాష్ ను అభ్యర్ధిగా చేస్తే స్ధానిక నేతలు ఎంత వరకూ సహకరిస్తారో అర్ధం కావటం లేదు. ఒకపుడు ఎన్టీయార్ పోటీ చేసి గెలిచిన గుడివాడను చంద్రబాబు కావాలనే గాలికొదిలేశారు. ఎన్టీయార్ వారసుల్లో ఎవరో ఒకరిని ఇక్కడ నుండి  పోటీ చేయిస్తుంటే సరిపోయేది. అలా చేయకుండా ఎన్నికకో అభ్యర్ధిని పోటీ చేయిస్తున్న కారణంగానే టిడిపికి ఇపుడు గట్టి అభ్యర్ధి లేకుండా పోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: