కర్నూలు జిల్లాలో మాజీ ఎంఎల్ఏ గౌరు కుంటుంబం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం ఎక్కువైపోతోంది. రాబోయే ఎన్నికల్లో పాణ్యం నుండి పోటీ చేసే విషయంలో  తమకు ఎటువంటి హామీ ఇవ్వకపోవటంపై గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో పాణ్యం టికెట్ తమకే అంటూ మాజీ ఎంఎల్ఏ కాటసాని రాం భూపాలరెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటుండటం కూడా గౌరు అసంతృప్తిని పెంచేస్తోంది.

 

లండన్ పర్యటనలో ఉన్న జగన్ తిరిగి రాగానే భేటీ కావాలని గౌరు దంపతులు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో వైసిపిలో తాము ఇమడలేని పరిస్దితులు తలెత్తితే వెంటనే తెలుగుదేశంపార్టీలోకి జంప్ చేయటానికి వీలుగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందుకనే ముందు జాగ్రత్తగా నియోజకవర్గంలో మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించుకుంటున్నారు.

 

నిజానికి గౌరు దంపతులు ఇప్పటికిప్పుడు టిడిపిలోకి మారినా పోటీ చేయటానికి అక్కడ కూడా అవకాశాలు లేవనే చెప్పాలి. కాకపోతే పార్టీలో కాటసాని ఆధిపత్యాన్ని సహించలేకే పార్టీ మారాల్సొస్తోందని సమాచారం. జగన్ జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య చేస్తే గౌరు దంపతులు వైసిపిలోనే ఉంటారేమో చూడాలి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పాణ్యం టికెట్ కాటసానికే దక్కుతుంది.

 

అదే సమయంలో ఎంఎల్సీ టికెట్ హామీ ఇస్తే గౌరు కుటుంబం పార్టీలోనే ఉండే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాదూ కూడదంటే గౌరు కుటుంబానికి జనసేన పార్టీనే దిక్కు. మొత్తానికి గౌరు కుటుంబం గనుక పార్టీని వదిలేయాలని నిర్ణయించుకుంటే వైసిపికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: