జీవితాలతో చెలగాటం ఆడకూడదు, అసలు జీవితమే ఓ సినిమా. మరి అందులో ఉన్న ట్విస్టులను కన్వీనియెంట్ గా మార్చేసుకోవాలనుకుంటే అది జీవితమూ కాదు, సినిమా అంతకంటే కాదు. అసలు ఆడియన్ ఎలా రియాక్ట్ అవుతాడో ముందే ఊహించడమే మేకర్ గొప్పదనం, ఇక కొన్ని సార్లు అతి చేస్తూ లేనిపోనివి వూహించుకోవడం వల్ల కూడా  అసలుకే ఎసరు వస్తుంది. అందువల్ల ఏం తీశాం, ఏం చేశాం అని కాదు, ఎంతవరకూ చిత్తశుద్ధితో ఎఫెర్ట్స్ పెట్టమన్నదే కొలమానం. 


చూస్తూంటే ఇపుడు బయోపిక్కుల రోజులు వచ్చేశాయి. ఓ మహనీయుడి జీవితాన్ని మూవీగా తీయడమో లేక ఆయన గురించిన సందేశాన్ని ఇవ్వాలని చూడడమో జరుగుతోంది. ఈ ప్రయంత్నాలు కొంతమంది మనసు పెట్టి చేస్తున్నారు. మరి కొంతమంది ఏదో ఆశించి చేస్తున్నారు. దాని వల్లనే ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఉన్నది ఉన్నట్లు చూపిచడమే బయోపిక్ లో ఉన్న అసలైన బ్యూటీ. దాన్ని మిస్ చేస్తూ ఏవేవో కొత్తవి అల్లడం,  అన్నీ పొగడ్తలతో  నింపేయడం, లేదా మంచిగానే ఓ మనిషి జీవితం సాగిందని చెప్పడం, ఓ దైవ సమానునిగా భావిస్తూ భ్రమలు కల్పించడం ఇలాంటి పోకడల వల్ల  క్యూరియాసిటీ పోతుంది. అంతే కాదు. అసలు చరిత్ర కూడా మరుగున పడుతుంది.


ఇపుడు మహానాయకుడు రిలీజ్ అయింది. అందులో అన్న గారి జీవితాన్ని కొంతవరకే చూపించారు. నిజానికి అన్న గారు 73 ఏళ్ళు బతికారు. 62 ఏళ్ల జీవితానే చూపించి అతి కీలకమైన, ఎన్నో మలుపులు, కధా కమామీషు ఉన్న  పదకొండేళ్ళ  జీవితం పక్కన పెట్టేశారు. నాదేండ్ల వెన్నుపోటు తరువాత 1985లో అన్న గారు రెండవ మారు  సీఎం అయిన తరువాత  నుంచి మరిన్ని రాజకీయ మసాలలు ఎన్నో ఉన్నాయి.అప్పట్లో చిన్నల్లుడు  చంద్రబాబు నాయుడు ప్రమేయం రామారావు  ప్రభుత్వంలో ఒక్కసారిగా పెరిగిపోయింది.   ప్రతీ దానికీ ఆయన్నే కలవాల్సివచ్చేది. ఈ ధోరణి పెచ్చుమీరి సీనియర్లు చాలా మంది పార్టీ వదిలి వెళ్ళిపోయారు. అనేక మంది అవమానించబడ్డారు. అల్లుడు కోసం నా మెడను పళ్ళెంలో పెట్టి నందమూరి వారు బహూకరిచారని ఆనాటి మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి ఘోషించారు.  ఆయన్ని బలవంతంగా పార్టీ నుంచి బయటకు నెట్టడం వెనక చంద్రబాబు పాత్ర ఉందని అంటారు. 


ఇక 1988 టైంలో టీడీపీలోనే ఉన్న కేయీ క్రిష్ణ మూర్తి, ముద్రగడ పద్మనాభం లాంటి వారు బయటకు వచ్చేశారు. దానికి కారణం నాడు చంద్రబాబు పెత్తనం అటు పార్టీ మీద, ఇటు ప్రభుత్వం మీద ఎక్కువ ఐపోవడమెనని నాటి మీడియాలో వచ్చిన కధనాలు చెబుతాయి. ఇక కర్షక పరిషత్ అన్నది ఒకటి క్రియేట్ చేసి అన్న నందమూరి వారు తన అల్లుడు చంద్రబాబు ని అందులో కూర్చోబెట్టడం. అది చట్ట విరుద్ధమని కోర్టులు నాడు కొట్టివేయడం అన్న గారి జీవిత చరిత్రలో ఓ భాగమే. ఇలా రెండు మూడు సార్లు జీవో రామారావు ప్రభుత్వం తీసుకురావడం, కోర్టులు కొట్టివేయడం జరిగింది. అప్పట్లో బాబుకు వ్యతిరేకంగా ఓ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీలో వ్యతిరేక కధనాలు, కార్టూన్లు వచ్చిన సంగతి అపుడు ఉన్న ఇప్పటి తరం వారికి చాలా మందికి తెలుసు.


అంతే కాదు. 1985 నుంచి  1989 డిసెంబర్ మధ్యలో జరిగిన రామారావు పాలనా కాలంలో అవినీతి, బంధుప్రీతి వంటివి బాగా పెరిగిపోయాయని విపక్షాలు ఆరోపణలే కాదు, నాటి పత్రికలు కూడా గట్టిగా రాశాయి. చివరకి కాంగ్రెస్ నాయకుడు ద్రోణం రాజు సత్యనారాయణ అన్న గారి మీద హై కోర్టులో వంద ఆరోపణలతో కేసు వేస్తే అందులో ఏడింటికి ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.  1989 జనవరిలో దీని మీద తీర్పు వస్తే రామారావు గారు స్టే తెచ్చుకున్న సంగతి లోకానికి విధితమే. అదే టైంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగా దారుణ హత్యకు గురి కావడం, టీడీపీ ప్రభుత్వానికి అది మాయని మచ్చగా మిగలడం కూడా అన్న గారి జీవిత చరిత్రలో భాగమే.


ఇక అప్పట్లో పాలనను గాలికి వదిలేసి అన్న గారు తన పూర్వాశ్రమమైన సినిమా రంగంపై మక్కువ పెంచుకోవడం, బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ తీయడం, ముహూర్తం షాట్ కి జాతీయ ప్రతిపక్ష‌ నాయకులు రావడం, ఇవన్నీ రామారావు గారి రాజకీయ జీవితంలో చమక్కులే. విశ్వామిత్రుని గెటపు లోనే ప్రభుత్వ ఫైళ్ల మీద రామారావు గారు సంతకాలు పెట్టడం , అధికారులు షూటింగ్ స్పాట్ కే రావడం, విశ్వామిత్రుని గెటప్ లో  ఉన్న సీఎం కోసం పడిగాపులు పడడం  వంటివెన్నో నాడు  జరిగాయి. ఇవన్నీ కూడా ఓ ఎత్తు. 1989లో కాంగ్రెస్ పార్టీ చేతిలో రామారావు గారు పార్టీ ఓడిపోవడం, ఏకంగా కల్వకుర్తిలో   తానే స్వయంగా ఓటమి పాలు కావడం కూడా ఓ చరిత్ర. 


ఇక 1989 తరువాత రామారావు గారు ఓటమి పాలు కావడంతో మొదటి సారి ప్రతిపక్ష పాత్రలోకి రావడం, అసెంబ్లీలో కాంగ్రెస్ నేతల నుంచి ఘాటు విమర్శలు.  కాంగ్రెస్ సర్కార్ మీద అలిగి అన్న గారు అసెంబ్లీకి రానని భీష్మ ప్రతిన పూనడం, మెల్లగా విపక్ష పాత్ర చంద్రబాబు చేతుల్లోకి రావడం, పార్టీ మీద పట్టు ఆ విధంగా చంద్రబాబుకు పెరగడానికి కీలక పరిణామలంటారు.  ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలు, మధ్యలో లక్ష్మీ  పార్వతి ఎంటర్ కావడం, ఆమెతో పెళ్ళి ఆ తరువాత కుటుంబ కలహాలు ఇదొక కీలక మలుపు.


 ఇక మళ్ళీ 1994 డిసెంబర్లో  ఎన్నికల్లో రామారావు విజయం సాధించడం, కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే కుటుంబం అంతా కలసి ఆయన్ని సీఎం పదవి నుంచి దించేయడం. ఆ తరువాత  నాలుగు నెలలకే 1996 జనవరి 18న  విషాదకర పరిస్థితుల్లో రామారావు గారు కన్ను మూయడం ఇదీ రామారావు గారి పూర్తి జీవిత చరిత్ర. మరి బయోపిక్ అని చెప్పి కేవలం కొంత భాగమే చూపించడం ఎంతవరకూ సమంజసమన్న ప్రశ్నలు నాటి చరిత్ర తెలిసిన వారంతా అడుగుతున్నారు.


 అసలు నిజాయితీగా ఈ విషయాలు అన్నీ చూపించగలిగితే తప్పు ఒప్పు అన్నది జనం నిర్ణయిస్తారు. నిజానికి రామారావు గారు ఏ పని చేసినా ధైర్యంగా చేశారు. అందువల్ల ఆయన ముదిమి వయసులో ఆయన తీసుకున్న డేరింగ్ స్టెప్ గా  రెండవ వివాహం ద్వారా నిజమైన హీరోగా జనంలో నిలిచిపోయేవారేమో. మొత్తానికి అన్న గారి జీవిత చరిత్ర అని చెప్పి ఆయన వ్యక్తిత్వ హననం జరిగిందన్నది మేధావుల భావనగా ఉంది. అసలైన అభిమానుల ఆవేదన కూడా అలాగే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: