మనిషన్నాక కళా పోషణ ఉండాలంటారు ముత్యాల ముగ్గు రావుగోపాలరావు, అయితే మనిషి అన్నాక కాసింత సెంటిమెంట్ కూడా ఉండాలి. ఉంటుంది. అది యాంటీ సెంటిమెంట్ అయినా కూడా వెంటాడుతుంది. అన్నీ చూసుకుని ముందుకు సాగినా కూడా జరగాల్సింది జరుగుతుంది. అయినా మనుషులు కాబట్టి సెంటిమెంట్లను నమ్ముతారు. కొందరు నమ్మనట్లు నటించినా వెనకాల చేసేది కూడా అదే పని.


టీడీపీకి యాంటిసెంటిమెంట్ :


ఇకపోతే టీడీపీని యాంటీ సెంటిమెంట్ పట్టి పీడిస్తోంది. అదేంటో మొన్ననే గుంటూరుకు వచ్చి ప్రధాని మోడీ గారు మిర్చీ లాంటి డైలాగులతో ఎండగట్టేశారు. వరసగా రెండు ఎన్నికల్లో గెలిచిన చరిత్ర చంద్రబాబు గారికి లేదని హాట్ కామెంట్స్ చేశారు. ఇక పొత్తులు కాకుండా విడిగా పోటీ చేసిన చరిత్ర టీడీపీ లేదని విపక్షాలు అంటున్నాయి. నిజానికి ఈ రెండూ టీడీపీకి యాంటి సెంటిమెంట్లే. ఇపుడదే టీడీపీని పట్టి పీడిస్తోంది. బాబు గత చరిత్ర చూసినా, టీడీపీ రికార్డుని ఓ సారి తీసుకున్నా నాటి రామారావు గారి కాలం నుంచి  పొత్తులతోనే టీడీపీ బండి లాగించిందన్నది స్పష్టంగా తెలుస్తోంది.


మొదటి నుంచి అలాగే :


తొలిసారిగా 1983లో పార్టీ పెట్టీనపుడు అన్న గారు ఇందిరా గాంధి కోడలు మేనకాగాంధి ఏర్పాటు చేసిన సంజయ్ విచార్ మంచ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీకి అయిదు సీట్లు ఇచ్చారు. అందులో వారు  ఒకరు గెలిచారు కూడా. ఇక 1985 ఎన్నికల్లో బీజేపీ, వామపక్షాలతో పొత్తులు పెట్టుకుంది టీడీపీ, 1989 నాటికి వామపక్షాలతో కలసి టీడీపీ ఎన్నికలకు వెళ్ళింది. 1994 ఎన్నికల్లోనూ కామ్రేడ్స్  తోనే నందమూరి ఎన్నికలకు వెళ్ళారు. 1999, 2004 ఎన్నికల్లో బీజేపీతో చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారు. 2009 ఎన్నికల్లో కామ్రేడ్స్,  టీయారెస్ తో కలసి ఎన్నికలకు వెళ్లారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలసి ఎన్నికలలో గెలిచారు. ఇపుడు 2019లో ఇప్పటికైతే టీడీపీకి ఏ పార్టీతోనొ పొత్తు లేదు. దాంతో ఆ పార్టీ తొలిసారి ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందో అన్న కంగారు పార్టీ శ్రేణుల్లో ఉంది.


రెండవ మారు గెలవలేదు ;


ఇక చంద్రబాబు నాయకత్వంలోకి టీడీపీ వచ్చాక వరసగా రెండు ఎన్నికల్లో గెలిచిన చరిత్ర టీడీపీకి లేదు. 1999 ఎన్నికల్లో తన నాయకత్వంలో టీడీపీని గెలిపించిన బాబుకు 2004 ఎన్నికలు చేదు ఫలితాలు ఇచ్చేశాయి. 2009 లోనూ ఆయన మరో సారి ఓడిపోయారు. ఇపుడు ఓ వైపు ఒంటరి పోరు సెంటిమెంట్, మరో వైపు రెండవ మారు వరసగా గెలిచే ట్రాక్ రికార్డ్ లేని యాంటి సెంటిమెంట్ ఇవన్నీ కలసి అటు టీడీపీని, ఇటు చంద్రబాబుని నిద్రపోనీయడంలేదంటే నమ్మాలిగా.


మరింత సమాచారం తెలుసుకోండి: