దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికలకోసం సిద్ధమవుతోంది. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. అధికారి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి కట్టేందుకు పలు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల ర్యాలీలు ఏర్పాటు చేశాయి. ప్రధాని మోదీ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నాయి. ఎలాగైనా ఈసారి మోదీ మళ్లీ ప్రధాని పీఠంపై కూర్చోకుండా చేసేందుకు బీజేపీయేతర ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు అధికార బీజేపీ కూడా అంతే ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది. ఎన్డీయే కూటమిలోని పార్టీలతో సీట్లు సర్దుబాటు చేసుకుంటోంది. తిరిగి ఎలాగైనా ఆధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

 Image result for pulwama attack

మే చివరినాటికి మోదీ ప్రభుత్వ గడువు ముగుస్తుంది. ఈలోపు ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు పూర్తి చేసి రేపోమాపో షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్, మే మాసాల్లో ఏడెనిమిది విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. గడువు తీరకముందే జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓవైపు పార్టీలు, మరోవైపు ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి.

 Image result for war over pakistan

అయితే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయా అనే సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. ఎన్నికలకు వెళ్తున్నవేళ జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడి అధికార బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే పరాజయం తప్పదనే భావన ఆ పార్టీలో ఉంది. అందుకే ఉగ్రవాద దాడిపై తగిన ప్రతికారం తీర్చుకున్నాకే ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధమవుతోందనే ఊహాగానాలు ఢిల్లీలో జోరుగా వినిపిస్తున్నాయి. 40మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేసిన తర్వాతే మిగిలిన అంశాలపై దృష్టి పెట్టాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం వేగంగా పావులు కదుపుతోంది. జమ్ము కశ్మీర్లో వేర్పాటువాద నాయకులను ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. వారిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. వారందరినీ విమానాల ద్వారానే సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తోంది. మరోవైపు అనుమానాస్పద ప్రాంతాల్లో ఇంటింటి సోదాలు చేస్తోంది. ఏమాత్రం అనుమానం వ్యక్తమైనా అలాంటి వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది. వందకు పైగా కంపెనీల పారామిలిటరీ ట్రూప్ లను కశ్మీర్ తరలించింది. బాహ్యప్రపంచానికి తెలియకుండా యుద్ధానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందనే ఊహాగానాలు అటు జమ్ము కశ్మీర్ లోనూ, ఇటు హస్తినలోనూ జోరుగా వినిపిస్తున్నాయి.

 Image result for india general election 2019

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం యుద్ధానికి వెళ్తే సార్వత్రిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆరు నెలలు లేదా ఏడాది పాటు సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేసి పాక్షిక యుద్ధం ద్వారా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలను అణచివేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. జవాన్ల మృతికి తగిన భారత్ తగిన జవాబు ఇచ్చిందని ప్రజలు భావించేలా చేయాలనేది మోదీ – షా టీం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడు ఎన్నికలకు వెళ్తే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనేది వారి ప్లాన్. మరి ఈ వ్యూహం నిజమో, కాదో మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: