ఎన్నికలు ముంచుకొస్తున్నాయ్.! పోటీ చేసేందుకు అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. టికెట్ దక్కితే చాలు ప్రచారపర్వంలో దూసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలూ సిద్ధం చేసుకుంటున్నారు. ఖర్చు ఎంతయినా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గెలవడం ఒక్కటే లక్ష్యం. అందుకే ఈసారి ఎన్నికలు చాలా కాస్ట్ లీ కాబోతున్నాయి.

 Image result for elections in india

మార్కెట్లో ప్రతి వస్తువు ధరా పెరిగిపోయింది. అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ వ్యయం కూడా తడిసి మోపెడు కావడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలు భారత చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవబోతున్నాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. గెలుపు కోసం పార్టీలు, నేతలు విపరీతంగా డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించింది. కార్నిగీ ఎండోన్మెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్ పీస్‌ సౌతేషియా ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ మిలన్‌ వైష్ణవ్‌ భారత ఎన్నికల ఖర్చుపై నివేదిక రూపొందించారు. ‘2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలకు కలిపి 650 కోట్ల డాలర్లు ఖర్చు అయింది. 2014లో భారత్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు 5 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అయింది. ఈ క్రమంలో 2019 ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఉండబోతున్నాయని నివేదికలో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటి దాకా జరిగిన అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కూడా ఇవి నిలిచే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.

 Image result for elections in india

భారత్ లో కొంతకాలంగా ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిపోతూ వస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ ఒక్కో నియోజకవర్గంలో నేతలు పెడుతున్న ఖర్చు ఏటికేడాది రెట్టింపు అవుతోంది. గత ఎన్నికల సమయంలో ఒక్కో అభ్యర్థి కనిష్టంగా ఐదుకోట్ల రూపాయలతో మొదలుపెట్టి.. గరిష్టంగా పాతిక, ముప్పైకోట్ల రూపాయలు ఖర్చు చేసిన వాళ్లున్నారు. అయితే ఈసారి కనీసం 15 కోట్లు ఉండొచ్చని అంచనా.. గరిష్టంగా కొన్ని నియోజకవర్గాల్లో వంద కోట్ల వరకూ ఖర్చయ్యే అవకాశం ఉంది.

 Image result for elections in india

పార్టీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లకే టికెట్ ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. డబ్బుతో ఏదైనా సాధించవచ్చనేది వాటి ఆలోచన. అందుకే డబ్బుంటే సీట్ ఖాయం అన్నట్టు పరిస్థితి తయారైంది. దేశంలోని దాదాపు అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎక్కువ ఖర్చు చేయగలిగే వారికే పార్టీలు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. వాళ్ల ట్రాక్‌ రికార్డులను పట్టించుకోవడం లేదు.

Image result for elections in india

ఓటర్లలో కూడా ఇప్పుడు ఎవరు ఎక్కువ డబ్బిస్తే వాళ్లకు ఓటేద్దాం అనే ఆలోచనకు వచ్చేశారు. గెలిస్తే వాళ్లు కోట్లు సంపాదించుకుంటున్నారు కాబట్టి డబ్బు తీసుకుంటే తప్పేమీ లేదనే ఫీలింగ్ వ్యక్తమవుతోంది. ఇక ప్రచారంకోసం కోడూ అభ్యర్థలు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. వెనుక మందీ మార్బలంతో వెళ్తేనే ఓటర్లు కూడా ఆ అభ్యర్థికి మంచి బలముందనే అంచనాకొస్తున్నారు. కాబట్టి ఈసారి ఎన్నికలు డబ్బు చుట్టూనే తిరగనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: