ఏపీ ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప. ఇక్క‌డ రెండు ఎంపీ స్థానాలు స‌హా 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా దాదాపు ఈ జిల్లా వైసీపీకి అండ‌గా నిలిచింది. అయితే, ఇప్పుడు మాత్రం వ్య‌తిరేక‌త వినిపిస్తోంది. మ‌రో రెండు మాసాల్లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థుల పోటీ పై నెలకొన్న వివాదం రాను రాను తీవ్ర‌రూపం దాలుస్తోంది. ఈ క్ర‌మంలో అస‌లు ఇక్క‌డ ఏం జ‌రుగుతోంది? ఎన్నిక‌ల ముందు పుంజు కోవాల్సిన పార్టీ ఎందుకు మైన‌స్ దిశ‌గా దూసుకుపోతోంది? వ‌ంటి కీల‌క ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. కడప జిల్లా వైసీపీలో అంతర్గత కలహాలకి కారణమేంటి? వైసీపీలో రెబల్స్ వల్ల ఎవరికి కలిసివచ్చే అవకాశముంది? 


జగన్ కోటలో వైసీపీ నేతల మధ్య సాగుతున్న జగడం ఏ స్థాయికి చేరింది?  అనే ప్ర‌శ్న‌లు మేధావుల‌ను సైతం తొలిచేస్తున్నాయి.  "మాట తప్పను- మడమ తిప్పను" అని తరచూ చెప్పుకొనే జగన్ కడపజిల్లా వైసీపీ నేతల విషయంలోనే మాట తప్పారట! దీంతో ఇప్పుడు ఆ జిల్లాలోని వైసీపీ నేతల మధ్య టిక్కెట్ల పోరు షురూ అయ్యింది. నిరసనగళాల సంఖ్య పెరుగుతోంది. కడప జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టిక్కెట్లు ఇస్తానని గతంలో జగన్ పదేపదే చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సీన్ రివర్స్ అయింది. ఈ మధ్య రాజంపేటకి చెందిన మేడా మల్లికార్జునరెడ్డి తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరారు. 


దీంతో రాజంపేట వైసీపీ టిక్కెట్‌ని మేడాకి ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారట. నిజానికి అప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న అమరనాథ్‌రెడ్డికి టిక్కెట్ హామీ ఇచ్చారట జగన్‌! ఈ నేపథ్యంలో తమ నేత విషయంలో జగన్‌ మాట తప్పారంటూ రాజంపేటలో అమరనాథ్‌రెడ్డి వర్గీయులంతా ఆందోళన బాటపట్టారు.  మొదటినుంచి అమరనాథ్‌రెడ్డి వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కి సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా నిన్నగాక మొన్న పార్టీలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డికి ఎలా అభ్యర్థిత్వం కట్టబెడతారని జగన్‌పైనా, వైసీపీ అగ్రనేత లపైనా అమరనాథ్‌రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. 


టిక్కెట్‌ వేరే వారికి ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ముందుగానే అమరనాథ్‌ను పిలిపించి ఎందుకు మాట్లాడలేదని వారు ప్రశ్నిస్తున్నారు. అమర్‌కి ప్రత్యామ్నాయ అవకాశం కల్పించే విషయంలో జగన్‌ హామీ ఇవ్వకపోవడమే ఈ మొత్తం పరిణామానికి కారణమని చెప్పుకోవాలి! ఈ పరిస్థితుల్లో స్వతంత్రంగా బరిలోకి దిగమని అమరనాథ్‌రెడ్డి వర్గీయులు ఆయనపై వత్తిడి తెస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: