క‌ర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ టికెట్ కోసం గౌరు దంప‌తులు..కాట‌సాని రా భూపాల్‌రెడ్డిల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధ‌మే జ‌రుగుతోంది. గౌరు చ‌రితారెడ్డి ప్ర‌స్తుతం పాణ్యం ఎమ్మెల్యేగా ప‌నిచేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఆమె ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు.  కొద్ది కాలం క్రితం వైసీపీలో చేరిన రాం భూపాల్‌రెడ్డి  సుధీర్ఘ‌కాలంగా కాంగ్రెస్‌లో కొన‌సాగారు. వైఎస్‌తో మంచి అనుబంధం ఉంది. అదే పార్టీ గుర్తుపై 5సార్లు ఎమ్మెల్యేగా రాం భూపాల్‌రెడ్డి ఎన్నిక‌య్యారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ప‌రిస్థితుల‌తో బీజేపీలోకి మారిన ఆయ‌న అక్క‌డా ఇముడ‌లేక‌..పార్టీకి క్యాడ‌ర్ లేక‌పోవ‌డంతో జ‌గ‌న్‌తో చ‌ర్చించి వైసీపీలోకి జంప్ అయ్యారు. రాం భూపాల్‌రెడ్డి రాక‌నే  గౌరు దంప‌తులు వ్య‌తిరేకిస్తూ వ‌చ్చారు. 


ఇద్ద‌రి మ‌ధ్య స‌మ‌న్వ‌యం లోపించింది. ఎవ‌రికి వారుగా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ వ‌స్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే పోటీ చేస్తాన‌ని ప‌లుమార్లు రాం భూపాల్‌రెడ్డి వైసీపీ నేత‌ల‌కు స్ప‌ష్టం చేసిన నాటి నుంచే  గౌరు దంప‌తులు ఆయ‌న‌పై అగ్గిమీద గుగ్గిలంలా మారారు. జ‌గ‌న్ కూడా రాం భూపాల్‌రెడ్డి వైపే ఉన్నార‌ని, ఆయ‌న‌కే టికెట్ క‌న్ఫ‌ర్మ్ కానుంద‌ని పార్టీలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఈనేప‌థ్యంలో ఈ విష‌యాల‌ను జీర్ణించుకోలేక‌పోతున్న గౌరు దంపతులు ఇక లాభం లేద‌నుకుని డైరెక్ట్‌గా జ‌గ‌న్ వ‌ద్ద‌కే వెళ్లి తాడోపేడో తేల్చుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. టికెట్ ఇస్తే పార్టీలో కొన‌సాగుతాం..లేదంటే పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లాల‌ని తుది నిర్ణ‌యంతో వారు రెడీగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. జ‌గ‌న్తో రేపు వారు భేటీ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.మ‌రోవైపు  మార్చి మొదటి వారంలోనే  గౌరు దంపతులు టీడీపీలో చేరుతారని మీడియాలో కథనాలు ప్ర‌చురితం కావ‌డం గ‌మ‌నార్హం. 


కాట‌సానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గౌరు చ‌రితారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే విధంగా జ‌గ‌న్ హామీ ఇవ్వొచ్చు అన్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌ను గౌరు దంప‌తులు తోసి పుచ్చుతున్న‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీకి ఒప్పుకుంటే ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల్సి వ‌స్తుంద‌ని, ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటే అనుచ‌ర వ‌ర్గం చేజారిపోతుంద‌ని..అలా అయితే త‌మ ఉనికియే ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంద‌న్న ఆలోచ‌న‌లో గౌరు దంపతులున్న‌ట్లు తెలుస్తోంది.

ఈనేప‌థ్యంలో జ‌గ‌న్‌కు పాణ్యం టికెట్ అంశం క‌త్తిమీద సాములా మారనుంద‌నే చెప్పాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు. అయితే భేటీలో ఏం జ‌రుగబోతోంద‌న్న‌దే ఇప్పుడు క‌ర్నూలు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో గౌరు దంపతులకు జగన్‌ పాణ్యం టికెట్‌పై హామీ ఇస్తారా? ఒకవేళ టికెట్ గ్యారెంటీ ఇవ్వలేకపోయినా మరో మార్గంలో బుజ్జగిస్తారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: