కాలం తీరు భిన్నంగా ఉంటుంది. దాన్ని ఎవరూ అంచనా వేయలేరు.  అందుకే టైం అంటారు. నిన్నలా నేడు ఉండదు, రేపు అంతకంటే ఉండదు. ఒక్కోసారి టైం మిషన్ అలా వెనక్కి కూడా వెళ్తూంటుంది. గత వైభవాన్ని తీసుకొస్తుంది. మరి కీలకమైన ఈ టైంలో ఏం జరగ‌బోతోంది.


సరిగ్గా రెండు దశాబ్దాలు :


సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం అంటే 1999 టైం అది. అప్పట్లో ప్రధానిగా వాజ్ పేయ్ అనేక మిత్ర పక్షాలతో సంకీర్ణరధాన్ని నడుపుతున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ కాలు దువ్వింది. కార్గిల్ పేరిట భారీ విద్రోహానికి తలపెట్టింది. అంతే వాజ్ పేయ్ జూలు  విదిలించారు. బారత్ సైనికులను సమాయత్తపరచి  మరీ పాక్ భరతం పట్టారు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో కార్గిల్ ఫీవర్ అంతా ఇంతా కాదు. దేశమంతా వాజ్ పేయ్ గాలిలో మంచి మెజారిటీతో ఎన్ డీ యే కూటమి నెగ్గింది. . ఉమ్మడి  ఏపీలో కూడా అప్పట్లో కచ్చితంగా కాంగ్రెస్ వస్తుందనుకున్నారు. వైఎస్సార్ అపుడు ముఖ్యమంత్రి  అని అంతా భావించారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు తన నాయకత్వంలోని టీడీపీకి తొలి విజయం అలా అందించారు. 


మోడీ మైలేజ్ పెరిగింది :


సీన్ కట్ చేస్తే ఇపుడు 2019 వచ్చింది. ఇరవయ్యేళ్ళ కాలం. ఇపుడు కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. పాక్ ప్రేరేపిత ఘాతుకం పుల్వామాలో జరిగింది. దానికి ప్రతిగా మోడీ సారధ్యంలో సర్కార్ గట్టి గుణపాఠం ఎప్పింది. నిన్న ఏకంగా బోర్డర్ దాటేసి మరీ పాక్ లోని జైషే ఉగ్ర శిబిరాలను తుదముట్టించేసింది. కేవలం ఇరవై ఒక్క నిముషాల్లోనే ఈ భారీ ఆపరేషన్ పూర్తి అయింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అనుకున్న పని పూర్తి చేసుకుని మన వాయుసేన వచ్చింది. రాత్రంతా నిద్ర కూడా లేకుండా మోడీ ఈ ఆపరేషన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఎప్పటికపుడు తగిన జాగ్రత్తలు సూచనలు ఇస్తూ ఆయన కంట్రోల్ రూం లోనే గడిపారు. మొత్తానికి భారతావనికి అద్భుత విజయం సైనికులు అందిస్తే దాని వెనక మోడీ ఉన్నారు. 


ఆపరేషన్ సక్సెస్ :


దాంతో మోడీ ప్రతిష్ట ఇపుడు దేశంలో ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం పది రోజుల్లోనే పాక్ కి గట్టి బుద్ధి చెప్పి భారతీయుల మనసుల్లో ఆనందం, గర్వం నింపిన ఘనత అచ్చంగా మోడీదే అనడంతో సందేహం లేదు. ఎందుచేతనంటే గతంలో అంటే 2008 నవంబర్ 26న ముంబై దాడులు జరిగినపుడు యూపీయే అధికారంలో ఉంది. నాడు కూడా  పాక్ ఉగ్ర మూకలపై దాడికి భారత వాయుసేన అనుమతి కోరింది. పాక్ పీచం అణుస్తామని చెప్పింది కూడా అయినా నాటి ప్రభుత్వం చర్చ‌లే మార్గమంటూ తోసిపుచ్చింది. అందువల్లేనే ఈ ఘనత మోడీదే. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ఒకవేళ ఆపరేషన్ లో తేడా వస్తే ఆ విమర్శలు మోడీవే కాబట్టి, ఈ విజయం కూడా ఆయనదే అనడంలో ఎటువంటి డౌట్లూ లేవు.


కార్గిల్ ఫలితాలు వస్తాయా :


నాడు కార్గిల్ యుద్ధం తరువాత వాజ్ పేయ్ నాయకత్వంలోని ఎన్ డీ యే భారీ ఆధిక్యతతో దేశంలో అధికారంలోకి వచ్చింది. ఇపుడు మోడీ సారధ్యంలో కూడా ఎన్ డీ యే కూటమి అలాగే వస్తుందా అన్న దానిపై చర్చ సాగుతోంది. ఇది రాజకీయం చేసే సమయం కానప్పటికీ ఎన్నికలు ఉన్నందున అందరి ఆలోచనలూ ఆ దిశగా సాగుతాయి. ముఖ్యంగా ఈ దేశాన్ని కాపాడడంలో, పాక్ కి తగిన బుద్ధి చెప్పే విషయంలో మోడీ ఇప్పటికి రెండు సార్లు విజయం సాధించారు. అందువల్ల ఇదే రేపటి ఎన్నికల్లో ఓటర్ల మదిలో ప్రధాన అంశమైతే మాత్రం మోడీకి ఎదురే ఉండదు. ఇప్పటికీ మెజారిటీకి తక్కువలోనైనా మోడీదే మరో మారు అధికారం అని జాతీయ సర్వేలు ఘోషిస్తున్న వేళ ఈ రెండవ సర్జికల్ స్ట్రైక్ అమాంతం సిక్సర్ దాటేసేలా చేస్తుందనడంలో సందేహం లెదని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. అదే జరిగితే మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు లాంటి   వారికి ఇది భారీ షాకే మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: