ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అందుకోసం ఎన్నో ప్రత్యేక పద్దతులను అవలంభిస్తోంది.  మొన్నటి వరకు ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లోకి ప్రత్యక్షంగా వెళ్లి వారి స్థితిగతులు పరిశీలించి వారి సమస్యలు పరిష్కరిస్తానని..తమ ప్రభుత్వంలో ఎలాంటి కష్టాలు ఉండబోవని వైసీపీ అధ్యక్షులు జగన్ భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు, పార్టీని బలోపేతం చేసుకుంటూనే మరోవైపు, అధికార పక్షాన్ని దెబ్బకొట్టే వ్యూహాలు అమలు చేస్తోంది.

అందుకోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీలోని కొందరు ముఖ్య నేతలు ప్రత్యర్థుల ఇళ్లకు సైతం వెళ్లి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ లండన్ నుంచి వచ్చిన వెంటనే గృహప్రవేశం చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.  అందుకోసమే ఆ పార్టీకి చెందిన ముఖ్యులు ఈ పనుల్లో బిజీ అయ్యారు. నేడు జగన్ మోహన్ రెడ్డి గృహ ప్రవేశం చేస్తున్నారు. అమరావతిలో నిర్మించుకున్న నూతన గృహంలో నేడు కాలుమోపనున్నారు.

ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమంలో జగన్, తన కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశం చేయనున్నారు.పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు తరలిరావడంతో ఈ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. గృహ ప్రవేశం అనంతరం జగన్, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: