ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి ఏపీ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనలా అభివృద్ది చేసే సామర్థ్యం లేనందు వల్లే మోడికి తానంటే భయం అంటూ కామెంట్ చేశారు. తాను గతంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేశానన్న చంద్రబాబు... అహ్మదాబాద్‌కు హైదరాబాద్‌కు పోలిక ఉందా అని ప్రశ్నించారు.



అందుకే ప్రధాని మోదీకి ఏపీ అంటే భయం అన్నారు. ఆ భయంతోనే ఏపీకి మట్టి, నీళ్లు మనముఖాన కొట్టి వెళ్లారని సీఎం కామెంట్ చేసారు. ఏపీ మట్టి, నీళ్లకు ఉన్న మహిమ ఎలాంటిదో త్వరలోనే చూపిస్తామన్నారు చంద్రబాబు. పనిలో పనిగా ఆయన కేసీఆర్ పైనా మండిపడ్డారు.



అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ కంటే ఏపీ ముందుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన నష్టాలను స్వయంకృషితో అధిగమిస్తున్నామన్నారు. అమరావతికి స్థానబలం ఉందని, ఈ ప్రాంతానికి శక్తి ఉందని చంద్రబాబు అన్నారు. విమర్శకుల నోళ్లు మూతపడే రోజు తొందర్లోనే ఉందన్నారు.



తాను అడగ్గానే ఇక్కడి రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని.. అదే జగన్‌ అడిగితే రైతులు ఎవరైనా ఇస్తారా..? చంద్రబాబు ప్రశ్నించారు. సింగపూర్ మాస్టర్‌ప్లాన్ ఇచ్చిందంటే మన విశ్వసనీయతే కారణమంటూ చెప్పుకొచ్చారు. ఐతే.. దేశమంతా ఓ వైపు సర్జికల్ స్ట్రయిక్స్ గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు ఇలా తన గురించి చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగించక మానదు.


మరింత సమాచారం తెలుసుకోండి: