చంద్రబాబు తనయుడిగా సుపరిచితుడైన నారా లోకేష్ ఇప్పుడు మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యక్ష ఎన్నిక ద్వారా కాకుండా పరోక్షంగా ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయ్యారు లోకేష్. అప్పుడున్న పరిస్థితుల్లో పరోక్ష ఎన్నికే అనివార్యమైంది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అసెంబ్లీ అడుగు పెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు..?

Image result for lokesh

          లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చాలా కాలంగా వినిపిస్తున్నమాటే.! అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇంతవరకూ తేలలేదు. నాలుగైదు స్థానాల్లో లోకేష్ పేరు బలంగా వినిపిస్తోంది. మామ బాలకృష్ణ, తాత ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి లోకేష్ బరిలోకి దిగుతారని మొదట్లో వార్తలొచ్చాయి. అయితే లోకేష్ ఆసక్తి చూపించనట్లు తెలుస్తోంది. మరోవైపు బాలకృష్ణ కూడా తనకు హిందూపురం అయితేనే సేఫ్ అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీంతో హిందూపురం జాబితాలో లేకుండా పోయింది.

Image result for lokesh and balakrishna

          ఆ తర్వాత కృష్ణా జిల్లా పెనమలూరు లేదా గుడివాడ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరు పెనమలూరు పరిధిలోకే వస్తుంది. దీంతో అక్కడి నుంచి ఆయన బరిలోకి దిగొచ్చని భావించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా లోకేష్ కోసం సీటు నుంచి తప్పుకునేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు జాబితాలో ఆ పేరు కూడా లేకుండా పోయింది. గుడివాడ నుంచి బరిలోకి దిగితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా పార్టీ శ్రేణుల్లో వచ్చింది. అయితే అక్కడి నుంచి తెలుగు యువత నేత దేవినేని అవినాష్ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆయనకు పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ రెండూ కూడా జాబితాలో లేకుండా పోయాయి.

Image result for lokesh chandrababu naidu

          అన్నిటికీ మించి కుప్పం నుంచి బరిలోకి దిగాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే లోకేష్ కు చెప్పినట్టు తెలిసింది. అయితే లోకేష్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. కుప్పం ప్రజలకు పాతికేళ్లకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబే వారికి సరైన లీడర్ అని చెప్పినట్టు తెలుస్తోంది. చంద్రబాబును తప్ప కుప్పం ప్రజలు మరొకరిని ఊహించుకోలేరని, ఆ స్థానం తనకొద్దని తిరస్కరించినట్లు సమాచారం. అంతేకాక.. పార్టీ అధినేత రాయలసీమ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో తాను కోస్తా లేదా ఉత్తరాంధ్ర నుంచి బరిలోకి దిగితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Image result for LOKESH vs avanthi

          లోకేష్ ఆసక్తిని గమనించిన చంద్రబాబు కొంతకాలంగా నియోజకవర్గం అన్వేషణలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఓ నియోజకవర్గం దాదాపు ఓకే అయినట్టు సమాచారం. అదే విశాఖ జిల్లాలోని భీమిలి. ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గానికి ప్రాతనిధ్యం వహిస్తున్నారు. గంటా ఈ నియోజకవర్గం నుంచి మారి వేరే చోట నుంచి పోటీ చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే కొంతకాలం క్రితం తాను నియోజకవర్గం మారట్లేదని ప్రకటించారు. అయితే లోకేష్ పోటీ చేస్తే తాను తప్పుకుని మరో చోట నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. భీమిలి టీడీపీకి కంచుకోట.. ఒకసారి తప్పి అన్ని ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ జయకేతనం ఎగురవేసింది. లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనేదానిపై ఇప్పటికే మూడు నాలుగు సార్లు సర్వే చేసినట్లు సమాచారం. పూర్తి పాజిటివ్ వాతావరణం ఉండడంతో లోకేష్ ఇక్కడి నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ ఇక్కడ బరిలోకి దిగనున్నారు. ఒకవేళ అవంతిపై పోటీ చేస్తే మాత్రం లోకేష్ కు గెలుపు ఈజీ అనే మాట వినిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: