నిజంగా జనసేనాని పవన్ కల్యాణ్ పరిస్ధితి చూస్తుంటే జాలేస్తోంది. జనసేన సభకు వచ్చి, పవన్ పక్కనుండగానే జగన్ కు జై కొట్టారంటే అర్ధమేంటి ? అదికూడా భుజం తడుతు రాబోయే ఎన్నికల్లో జగన్నే గెలిపిద్దామని పవన్ కే చెప్పారంటే పాపం పవన్ పరిస్ధితి ఎలాగుంటుందో ఎవరికీ వారుగా అర్ధం చేసుకోవాల్సిందే. కర్నూలు జిల్లాలోని ఆదోనిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా జరిగిన పై సంఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది.

 

పార్టీల అధినేతలు పాల్గొన్న సభల్లో మామూలుగా అయితే ఆ పార్టీల సానుభూతిపరులనే మాట్లాడిస్తారు. అందుకు స్ధానిక నేతలు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ జనసేన విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. మార్కెట్ యార్డనగానే రైతులందరూ చంద్రబాబునాయుడుపై మండిపోయి ప్రభుత్వాన్ని తిడతారని పవన్ అనుకునుంటారు. అదే సమయంలో జగన్ గురించిన ఊసే ఉండదని కూడా భావించారు. కాబట్టి రైతుల్లో ఎవరిని వేదికమీదకు  పిలిచి మైక్ ఇచ్చి మాట్లాడించినా పవనే ముఖ్యమంత్రి కావాలని చెబుతారని ఆశించారు.

 

అందుకే వేదిక మీద పవన్, నాదెండ్ల మనోహర్ అండ్ కో ఉండగానే ఓ రైతును వేదిక మీదకు పిలిచి మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. కానీ సీన్ మొత్తం రివర్సవుతుందని ఎవరూ ఊహించలేదు. వ్యవసాయరంగం పరిస్ధితికి ప్రభుత్వాన్ని  నిందించిన రైతు జగన్ కు జై కొడతారని ఏమాత్రం ఊహించలేదు. తాను పక్కనుండగానే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఎవరు అంటారులే అన్న ఆలోచనతో ఉన్న పవన్ కు రైతు మాటలతో ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. తాను జగన్ కు జై కొట్టటమే కాకుండా పవన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘ఈసారి మీరు కూడా జగన్నే గెలిపించాలి’ అనటంతో పవన్ మొహాన నెత్తురుచుక్క లేదు. పాపం పవన్ పరిస్ధితి ఏంటి ఇలాగైపోయిందేటబ్బా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: