అన్ని లెక్కలూ ఒకేలా ఉండవు, రాజకీయ గణితం చాలా తేడాగా ఉంటుంది. అక్కడ రెండు రెళ్ళు నాలుగు అంటే కుదరదు. మరి ఏపీలో రాజకీయం చూస్తూంటే చిత్రంగా ఉంది. కేవలం వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న చరిత్ర టీడీపీది. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒంటరి పోరుకే ప్రాధాన్యత ఇస్తోంది  వైసీపీ.  అయితే  ఇపుడు ఏపీలో రాజకీయం మాత్రం గందరగోళంగా ఉంది.


కండువా మార్చేసినట్లు :


సరిగ్గా అయిదేళ్ళ క్రితం మోడీ, బాబు జోడీ అన్న తమ్ముళ్ళే ఇపుడు బాబు రాహుల్  జంట అంటున్నారు. జనానికి అర్ధం కాని వింత రాజకీయం ఇది. ఇక దేశంలో చూసుకుంటే మోడీ హవా బాగా ఉందిపుడు. రాహులుని ప్రధాని గా ఇంకా దేశం అంగీకరించలేని స్థితి ఉంది. పైగా కాంగ్రెస్ బలం నానాటికీ తగ్గిపోతోంది. గత ఎన్నికల కంటే ఈసారి రెట్టింపు సీట్లు వచ్చినా ఆ పార్టీకి వందలోపే ఎంపీలుంటారు. మరి ఆ పార్టీ కేంద్రంలో ఎలా అధికారం చేపడుతుంది. ప్రధానిగా రాహుల్ ఎలా అవుతారు. ఇది సగటు పౌరులందరికీ అర్ధమైన విషయం. ఇక ఏపీని రెండు ముక్కలుగా చేసిన కాంగ్రెస్ పట్ల జనంలో చాలా కోపం వుంది. అలాంటి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బాబు ముందుకు వెళ్తున్నారు. ఏపీలో పొత్తు లేదని చెప్పినా జాతీయ స్థాయిలో ఉంటుంది కాబట్టి బాబు పైన ఆ ప్రభావం ఎక్కువగా పడడం ఖాయం.


మోడీతో లింక్ లాభమా :


ఇక చంద్రబాబు తాను వదిలేసిన మోడీని జగన్ కి ఇచ్చేశారు. మోడీ జగన్ ఒకటే అంటున్నారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని జగన్ చెబుతున్నా బాబు మాత్రం బలవంతంగా ముడివేసేశారు. మోడీ వ్యతిరేకత జగన్ కి అంటకడదామన్న చెడు  ఉద్దేశ్యమే ఇక్కడ కనిపిస్తోంది. అయితే మోడీ ఇమేజ్ ఇపుడు అమాంతం పెరిగింది. ఆయన గ్రాఫ్ బాగుందని టీడీపీ ఎంపీలే ఒప్పుకుంటున్నారు. మరి మోడీ మళ్ళీ ప్రధాని అవుతారని అంతా భావిస్తున్న వేళ ఆయనతో జగన్ కి కలిపి లింక్ పెడితే వైసీపీకే లాభమవుతుందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. 


ఎందుకంటే కేంద్రంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉంటేనే ఏపీ అభివ్రుధ్ధి సాదిస్తుందని నమ్మి గత ఎన్నికల్లో బాబుని ఇక్కడ గెలిపించారు. ఇపుడు ఏపీలో బాబు గెలిచినా అక్కడ మళ్ళీ మోడీ వస్తే ప్రతీ రోజూ ధర్మ పోరాటాలే ఉంటాయి తప్ప అభివ్రుధ్ధి ఉండదు అని జనం ఆలోచిస్తే మాత్రం బాబు ప్రచారం బూమరాంగ్ అవుతుంది. జగన్, మోడీ జోడీ హిట్ ఐతే మాత్రం టీడీపీకి లేని పోని కష్టాలు మొదలైనట్లే. అందువల్ల గత ఏడాదిగా చేస్తున్న ఈ ప్రచారం ఇపుడు జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిస్థితుల్లో వికటిస్తుందేమో టీడీపీ పెద్దలు ఆలోచించుకుంటే మంచిదేమో.
 



మరింత సమాచారం తెలుసుకోండి: